విద్యార్థుల‌కు అల‌ర్ట్‌.. తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ గ‌డువు పెంపు

Telangana EAMCET counselling schedule extended.తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ కౌన్సెలింగ్ గ‌డువును పెంచారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Aug 2022 1:23 PM IST
విద్యార్థుల‌కు అల‌ర్ట్‌.. తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ గ‌డువు పెంపు

తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ కౌన్సెలింగ్ గ‌డువును పెంచుతున్న‌ట్లు సాంకేతిక విద్యాశాఖ ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది. నేడు(మంగ‌ళ‌వారం) ఇంట‌ర్ రెండో సంవ‌త్స‌రం అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ఫ‌లితాలు విడుద‌ల కావ‌డంతో గ‌డువును పెంచుతున్న‌ట్లు తెలిపింది. స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని సాంకేతిక విద్యాశాఖ ఈ నిర్ణ‌యాన్ని తీసుకుంది.

ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌లో పలు మార్పులు చేశారు. ఇంటర్‌ సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైనవారి కోసం ధ్రువపత్రాల పరిశీలన స్లాట్‌ బుకింగ్‌ గడువును ఎల్లుండి వరకు, ధ్రువపత్రాల పరిశీలన గడువు సెప్టెంబరు 2 వరకు పొడిగించారు. వెబ్‌ ఆప్షన్ల గడువును సెప్టెంబరు 3 కు మార్చినట్లు తెలిపారు.

ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ సప్లిమెంటరీ పరీక్షల‌కు మొత్తం 1,14,289 మంది విద్యార్థులు హాజరుకాగా.. జనరల్‌లో 47.74 శాతం, ఒకేషన్‌లో 65.07 శాతం విద్యార్థులు ఉత్తీర్ణ‌త సాధించారు.

ఇంట‌ర్ ద్వితీయ సంవ‌త్స‌రం విద్యార్థులు వార్షిక ప‌రీక్ష‌ల‌తో సంబంధం లేకుండా ఎంసెట్‌కు హాజ‌ర‌వుతారు. ఇప్పటికే ఎంసెట్‌ ఫలితాలు ప్రకటించి, కౌన్సెలింగ్‌ ప్రక్రియ కూడా మొద‌లైంది. ఇంటర్ ఫెయిలై.. సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాలు రాకపోవడంతో తొలిదశ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌కు హాజరవ్వలేకపోతున్నారు. ఈ క్ర‌మంలోనే నేడు ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు. tsbie.cgg.gov.in లేదా results.cgg.gov.inకి వెళ్లి విద్యార్థులు తమ ఫలితాలను చూడొచ్చు.

Next Story