విద్యార్థులకు శుభవార్త.. 12వ తరగతి పరీక్షలు రద్దు
Tamil nadu government cancels 12th class board exams.కరోనా మహమ్మారి ఉద్దృతి కొనసాగుతున్న వేళ
By తోట వంశీ కుమార్ Published on 6 Jun 2021 7:23 AM IST
కరోనా మహమ్మారి ఉద్దృతి కొనసాగుతున్న వేళ విద్యార్థులకు శుభవార్త చెప్పింది తమిళనాడు ప్రభుత్వం. రాష్ట్రంలో 12వ తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. సుదీర్ఘ సంప్రదింపుల అనంతరం విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలోఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం స్టాలిన్ తెలిపారు. వార్షిక పరీక్షల గురించి ఆందోళన చెందుతున్న వారికి ఈ వార్త పెద్ద ఊరట కల్పించింది. 12వ తరగతి బోర్డు పరీక్షలతో పాటు టిఎన్ హెచ్ఎస్సీ+2 పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. వారందరి నేరుగా పై తరగతులకు ప్రమోట్ చేసేందుకు ప్రత్యేక కమిటీని వేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ స్కోర్ ఆధారంగానే ఉన్నత విద్యకు ప్రవేశాలు కల్పిస్తామని తెలిపారు.
కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుండగా.. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, నిపుణులతో మూడు రోజులుగా జరిపిన సంప్రదింపుల అనంతరం ఈ ఏడాది ఇంటర్ బోర్డు పరీక్షలు రద్దుచేయాలని నిర్ణయించినట్లు స్టాలిన్ ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులకు మార్కులు ఇవ్వడంపై నిర్ణయం తీసుకోవడానికి పాఠశాల విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నేతృత్వంలోని ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కమిటీ సిఫారసు ఆధారంగా విద్యార్థులకు మార్కులు ఇవ్వడం జరుగుతుంది. కాగా, విద్యార్థులు అయా కళాశాలల్లో కోర్సుల అడ్మిషన్లను బట్టి గ్రేస్ మార్కులు ఉంటాయని ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.