తెలంగాణలో నేడు జూనియర్ కాలేజీల బంద్
Student unions call for JR colleges bandh today.తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలను విడుదల చేసిన
By తోట వంశీ కుమార్ Published on 20 Dec 2021 2:47 AM GMTతెలంగాణ రాష్ట్రంలో ఇటీవల ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో 49 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అవ్వగా.. 51 శాతం మంది ఫెయిల్ అయ్యారు. తాము పరీక్షల్లో పాస్ కాలేకపోయామని కొందరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇందుకు కారణం ఇంటర్ బోర్డు నిర్లక్ష్యమేనని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో ఫెయిల్ అయిన విద్యార్థులందరినీ పాస్ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలల బంద్‌కు వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ విషయాన్ని ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ, ఏఐడీఎస్ఓ లు ఆదివారం వెల్లడించాయి.
దీంతో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ కాలేజీలు మూతబడనున్నాయి. ఫెయిల్ అయిన విద్యార్థులను కనీస మార్కులతో పాస్ చేయాలన్న డిమాండ్ ఆయా సంఘాల నుంచి వ్యక్తమవుతోంది. జవాబు పత్రాలను ఉచితంగా పునఃపరిశీలించాలని, ఫీజు లేకుండా ఇంప్రూమెంట్ పరీక్షలు జరపాలని ఆయా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విద్యార్థుల ఆత్మహత్యలపై సీఎం స్పందించాలని, విద్యాశాఖ మంత్రిని వెంటనే భర్తరఫ్ చేయాలని కోరుతున్నాయి.
ఇదిలా ఉంటే.. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో ఫెయిల్ అయినవారు.. ఇంప్రూవ్‌మెంట్ రాయాలనుకునేవారు 2022 ఏప్రిల్‌లో జరిగే వార్షిక పరీక్షలకు హాజరు కావొచ్చని తెలంగాణ ఇంటర్ బోర్డ్ సెక్రెటరీ సయ్యద్ ఒమర్ జలీల్ ఇప్పటికే ప్రకటించారు. ఇంటర్ ఫలితాలపై తమకు ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదన్నారు. 70 శాతం సిలబస్ తగ్గించడంతో పాటు, ప్రశ్నల్లో ఛాయిస్ పెంచి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఇక ఫలితాలపై అనుమానాలు ఉంటే.. రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రీ-వెరిఫికేషన్ ఫీజును కూడా రూ.100 నుంచి రూ.50కి తగ్గించినట్లు చెప్పారు. విద్యార్థులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.