తెలుగు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు ఎన్నిరోజులంటే..?
Sankranthi holidays in Telugu States.తెలుగు ప్రజలు జరుపుకునే పండుగల్లో సంక్రాంతి అతి పెద్దది.
By తోట వంశీ కుమార్ Published on 27 Dec 2022 10:09 AM IST
తెలుగు ప్రజలు జరుపుకునే పండుగల్లో సంక్రాంతి అతి పెద్దది. విద్య, ఉద్యోగం, వ్యాపారం నిమిత్తం వేరు వేరు ప్రదేశాల్లో నివసించే వారు సైతం పండుగగకు స్వగ్రామానికి వచ్చి కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో కలిసి ఎంతో ఆనందంగా సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. మరీ అలాంటి పండుగకు తెలుగు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలకు ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయో ఓ సారి చూద్దాం.
సంక్రాంతి పండుగను తెలంగాణ రాష్ట్రంలో కంటే ఆంధ్రలో చాలా ఎక్కువగా జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జనవరి 11 నుంచి 16 వరకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. జనవరి 17న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. అకడమిక్ క్యాలెండర్ ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరంలో 220 పాఠశాలలు పనిచేస్తాయని, 80 రోజులు సెలవులు ఉంటాయి. అదే విధంగా జూనియర్ కాలేజీలకు జనవరి 11 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. అయితే.. దీనిపై ప్రభుత్వం నుంచి ప్రకటన రావాల్సి ఉంది.
ఇక మరో తెలుగు రాష్ట్రం తెలంగాణలో సంక్రాంతికి 5 రోజులు సెలవులు ఉండనున్నాయి. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జనవరి 13 నుంచి 17 వరకు సెలవులు ఉంటాయి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో పాటు ఇంటర్ కాలేజీలకు ఈ రోజుల్లోనే సెలవులు ఉండనున్నాయి. జనవరి 18 న విద్యాసంస్థలు పునఃప్రారంభం కానున్నాయి.
ఇదిలా ఉంటే.. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. రెండు రాష్ట్రాల్లోనూ మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి.