చ‌ర్చ‌లు స‌ఫ‌లం.. ఆందోళ‌న‌ను విర‌మించిన బాస‌ర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు

RGUKT students call off protest after education minister promises.గ‌త వారం రోజులుగా సమస్యల పరిష్కారం కోసం బాసర ట్రిపుల్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Jun 2022 11:13 AM IST
చ‌ర్చ‌లు స‌ఫ‌లం.. ఆందోళ‌న‌ను విర‌మించిన బాస‌ర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు

గ‌త వారం రోజులుగా సమస్యల పరిష్కారం కోసం బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు తెరపడింది. సోమ‌వారం రాత్రి మంత్రి స‌బితా ఇంద్రారెడ్డితో జ‌రిపిన చ‌ర్చ‌లు స‌ఫ‌లం అయ్యాయి. స‌మ‌స్య‌లు అన్నింటిని ఒక్కొక్కటిగా నెల రోజుల్లో ప‌రిష్కారిస్తామ‌ని హామీ ఇవ్వ‌డంతో విద్యార్థులు.. అర్థ‌రాత్రి 12.30గంట‌ల స‌మ‌యంలో ఆందోళ‌న‌ను విర‌మించారు. నేటి(మంగ‌ళ‌వారం) నుంచి త‌ర‌గ‌తులకు హాజ‌రు అవుతామ‌ని విద్యార్థులు తెలిపారు.

విద్యార్థులు ప‌ట్టువీడకుండా ఆందోళ‌న చేస్తుండ‌డంతో రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆర్జీయూకేటీ ఇన్‌చార్జ్ వీసీ రాహుల్ బొజ్జా, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ వెంకటరమణ, డైరెక్టర్ సతీష్ కుమార్, విద్యాశాఖ కమిషనర్ వాకాటి కరుణ, ముధోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి ట్రిపుల్ ఐటీకి చేరుకున్నారు మంత్రి సబిత. తొలుత స‌మ‌స్య‌ల‌పై అధికారుల‌తో చ‌ర్చించిన మంత్రి.. అనంత‌రం 20 మంది విద్యార్థుల‌తో కూడిన గవర్నింగ్ కౌన్సిల్‌తో ఆడిటోరియంలో సమావేశమయ్యారు.

అర్ధరాత్రి వరకు చర్చలు కొనసాగాయి. నెల రోజుల్లో సమస్యలన్నీ తీరుస్తానని విద్యార్థులకు మంత్రి హామీ ఇచ్చారు. అయితే.. రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని విద్యార్థులు పట్టుబట్టారు. స్పందించిన సబిత.. మంత్రిని తాను స్వయంగా చెబుతున్నానని, ఇంకా ఎలాంటి హామీ కావాలని ప్రశ్నించారు. అనంతరం బయటకు వచ్చిన విద్యార్థులు ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించారు.నేటి నుంచి త‌ర‌గ‌తుల‌కు హాజ‌రు అవుతామ‌ని అన్నారు.

Next Story