జేఈఈ మెయిన్ పరీక్షల షెడ్యూల్ ఇదే
జేఈఈ మెయిన్ పరీక్షల షెడ్యూళ్లను ఎన్‌టీఏ ప్రకటించింది. తొలి విడత పరీక్షలు జనవరి 22 నుంచి, రెండో విడత పరీక్షలు ఏప్రిల్ 1 నుంచి జరగనున్నాయి.
By అంజి Published on 29 Oct 2024 1:54 AM GMTజేఈఈ మెయిన్ పరీక్షల షెడ్యూల్ ఇదే
జేఈఈ మెయిన్ పరీక్షల షెడ్యూళ్లను ఎన్‌టీఏ ప్రకటించింది. తొలి విడత పరీక్షలు జనవరి 22 నుంచి, రెండో విడత పరీక్షలు ఏప్రిల్ 1 నుంచి జరగనున్నాయి. దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీల్లో బీటెక్/ బీఆర్క్ సీట్ల భర్తీకి ప్రతి ఏటా జేఈఈ మెయిన్ పరీక్షలు నిర్వహిస్తారు. గత సంవత్సరంతో పోలిస్తే.. ఈ ఏడాది 40 రోజులు ఆలస్యంగా మెయిన్ ప్రవేశ పరీక్షల పరీక్షల షెడ్యూల్‌ను జాతీయ పరీక్షల సంస్థ ప్రకటించింది. ఈసారి కొత్తగా పరీక్షల ఫలితాల తేదీలను కూడా ప్రకటించారు. కాగా మెయిన్ పేపర్ - 1, 2లకు కలిపి గత ఏడాది 12.30 లక్షల మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి నుంచి సుమారు లక్షన్నర మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ సారి సిలబస్‌లో ఎలాంటి మార్పు లేదని విద్యా నిపుణులు చెబుతున్నారు.
ఈ నెల 28 నుంచి నవంబర్ 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షకు 3 రోజుల ముందు హాల్ టికెట్లు జారీ చేస్తారు. జనవరి 22 నుంచి జనవరి 31 మధ్య తొలి విడత పరీక్షలు జరుగుతాయి. ఫిబ్రవరి 12న ఫలితాలు వెల్లడవుతాయి. ఇక రెండో విడతకు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 24 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. పరీక్ష తేదీకి మూడు రోజుల ముందు హాల్ టికెట్లు జారీ చేస్తారు. ఏప్రిల్ 1 - 8 మధ్య పరీక్షలు జరుగుతాయి. ఏప్రిల్ 17 నాటికి ఫలితాలు వెల్లడవుతాయి.
దరఖాస్తులో ఇచ్చిన మొబైల్ నంబర్, ఈ మెయిల్‌కు ఏదైనా సమాచారం ఉంటే పంపుతామని ఎన్‌టీఏ తెలిపింది. పరీక్షలను తెలుగు, ఆంగ్లం సహా మొత్తం 13 భాషల్లో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఆంగ్లతో పాటు అభ్యర్థి కోరుకున్న రీజినల్ భాషలో ఇస్తారు. పేపర్ - 1 300, పేపర్ -2కు 400 మార్కులు ఉంటాయి. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు నిర్వహిస్తారు. దేశ వ్యాప్తంగా 31 ఎన్‌ఐటీల్లో 24 వేలకుపైగా, ట్రిపుల్ ఐటీల్లో 8,500లకుపైగా బీటెక్ సీట్లు ఉన్నాయి. ఎన్‌ఐటీల్లో 50 శాతం సీట్లు సొంత రాష్ట్రాల విద్యార్థులకు కేటాయిస్తారు.