గులాబ్ తుఫాన్ కారణంగా తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో జేఎన్‌టీయూహెచ్ కీలక నిర్ణయం తీసుకుంది. రేపు( మంగళవారం) జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసింది. రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మంగళవారం జరగాల్సిన బీటెక్, ఫార్మసీ సప్లిమెంటరీ పరీక్షలను కూడా వాయిదా వేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. షెడ్యూల్ ప్రకారం బుధవారం జరగాల్సిన పరీక్షలు యథాతథంగా జరుగుతాయని స్పష్టం చేసింది. కాగా.. వర్షం కారణంగా నేడు(సోమవారం) జరగాల్సిన పరీక్షలను కూడా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇక వాయిదా పడిన పరీక్షల షెడ్యూల్‌ను తరువాత ఖరారు చేయనున్నారు.
ఉస్మానియా పరిధిలో రేపు, ఎల్లుండి పరీక్షలు వాయిదా..
ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో మంగళ, బుధవారాల్లో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ఓప్రకనటలో తెలిపారు. ఈ నెల 30 నుంచి జరగాల్సిన పరీక్షలు మాత్రం యథాతథంగా జరుగుతాయని తెలిపారు. వాయిదా వేసిన పరీక్ష తేదీలను త్వరలోనే వెల్లడించనున్నట్లు తెలిపారు.