దేశంలోని టాప్ ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్షలు నేటి నుంచే ప్రారంభం కానున్నాయి. దేశంలో 12 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానుండగా, తెలుగు రాష్ట్రాల నుంచి 2 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. 22, 23, 24 తేదీలతో పాటు 28, 29 తేదీల్లో రెండు సెషన్లలో పరీక్షలు ఉంటాయి. ఉదయం 9 నుంచి 12 గంటల మధ్య మొదటి సెషన్, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల మధ్య రెండో సెషన్ పరీక్షలు జరుగుతాయి.
30న బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, బీ ప్లానింగ్ పరీక్ష నిర్వహిస్తారు. నిమిషం ఆలస్యం అయినా అనుమతించరు. ఇప్పటికే అడ్మిట్ కార్డులు విడుదల అయ్యాయి. ఇదిలా ఉంటే జేఈఈ మెయిన్ రెండో సెషన్ ఏప్రిల్‌లో నిర్వహిస్తారు. ఐఐటీలో బీటెక్ కోర్సు చేయాలంటే జేఈఈ మెయిన్‌లో ఉత్తీర్ణులైతే జేఈఈ అడ్వాన్స్‌డ్ రాయాల్సి ఉంటుంది. జేఈఈ మెయిన్‌లో కనీస మార్కులు సాధించిన 2.50 లక్షల మందికి మాత్రమే అర్హత లభిస్తుంది.