దేశంలోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) తదితర విద్యా సంస్థలలో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ(జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్) మెయిన్-2022 పరీక్షల షెడ్యూల్‌ను జాతీయ పరీక్షల మండలి(ఎన్‌టీఏ) విడుదల చేసింది. ఈ సారి రెండు విడుతల్లో మాత్రమే జేఈఈ మెయిన్ నిర్వహించనున్నట్లు తెలిపింది. తొలి విడుత పరీక్షలు ఏప్రిల్ 16, 17, 18, 19, 20, 21 తేదీల్లో, రెండో విడత పరీక్షలు మే 24, 25, 26, 27, 28, 29 తేదీల్లో జరుగనున్నాయి. మార్చి 1 నుంచి 31 వరకు సాయంత్రం 5 గంటల వరకు జేఈఈ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఎన్‌టీఏ తెలిపింది.
కాగా.. 2019,2020లో జేఈఈ మెయిన్ పరీక్షలను ఆన్‌లైన్ విధానంలో రెండు విడతలుగా నిర్వహించగా.. 2021లో కరోనా పరిస్థితుల కారణంగా విద్యార్థుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నాలుగు విడతల్లో నిర్వహించారు. అయితే..ప్రస్తుతం కరోనా ప్రభావం దాదాపుగా తగ్గిపోయి సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అంతేకాకుండా ప్రత్యక్ష తరగతులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు విడతలుగా పరీక్ష నిర్వహించాలని ఎన్‌టీఏ నిర్ణయించింది. జేఈఈ మెయిన్ అభ్యర్థుల సంఖ్య ఈసారి పెరిగే అవకాశం కనిపిస్తోంది.