జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల
IIT Bombay Announces JEE Advanced 2022 Result.జేఈఈ అడ్వాన్స్‌డ్-2022 ఫలితాలు విడుదల అయ్యాయి.
By తోట వంశీ కుమార్ Published on 11 Sept 2022 12:25 PM ISTజాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ) అడ్వాన్స్‌డ్-2022 ఫలితాలు విడుదల అయ్యాయి. ఐఐటీల్లో బీటెక్, బ్యాచులర్ ఆప్ సైన్స్(బీఎస్) సీట్ల భర్తీకి ఆగస్టు 28న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షకు 1.56 లక్షల విద్యార్థులు హాజరు అయ్యారు. నేటి(ఆదివారం) ఉదయం 10 గంటలకు ఐఐటీ బాంబే ఫలితాలను విడుదల చేసింది.
ఫలితాలను jeeadv.ac.in. వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఈసైట్‌లోకి వెళ్లి పుట్టిన రోజు, రూల్ నెంబర్‌ను ఎంటర్ చేసి ఫలితాలను పొందవచ్చు. ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. కటాఫ్ మార్కులను జనరల్ 88.41, ఈడబ్ల్యూఎస్ - 63.11, ఓబీసీ- 67, ఎస్సీ-43.08, ఎస్టీ-26.70 గా నిర్ణయించారు.
ఐఐటీ బాంబే జోన్‌కి చెందిన ఆర్‌కే శిశిర్ జేఈఈ అడ్వాన్స్‌డ్ టాపర్‌గా నిలిచాడు. ఆ తరువాత పోలు లక్ష్మి సాయి లోహిత్ రెడ్డి, థామస్ బిజు చీరమ్‌వెలిల్, వంగపల్లి సాయి సిద్దార్థ,మయాంక్ మోత్వానీ, పోలిశెట్టి కార్తీకేయ, ప్రతీక్ సాహు, ధీరజ్ కురుకుంద లు ఉన్నారు.
ఫలితాలు విడుదలైన నేపథ్యంలో రేపటి నుంచి ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే సాంకేతిక విద్యాసంస్థల్లో ప్రవేశాలకు జోసా(జాయింట సీట్ అలకేషన్ అథారిటీ) కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. దేశంలోని 23 ఐఐటీల్లో మొత్తం 16,598 సీట్లకు కౌన్సెలింగ్ జరగనుంది. అత్యధికంగా 2,129 మెకానికల్ ఇంజినీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి.
ఐఐటీల్లో ఈ సారి కూడా కంప్యూటర్ సైన్స్, ఐటీ కోర్సులకే డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.