కరీంనగర్ జిల్లాలోని శాతవాహన విశ్వవిద్యాలయంలో త్వరలో మూడేళ్ల ఎల్‌ఎల్‌బి కోర్సు ప్రారంభం కానుంది. శాతవాహన వర్శిటీలో ‘లా కాలేజీ’ ఏర్పాటుకు బార్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మంగళవారం (మే 13) ఉత్తర్వులు జారీ చేసింది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI).. కరీంనగర్‌లోని శాతవాహన విశ్వవిద్యాలయంలోని కాలేజ్ ఆఫ్ లాకు దాని మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ ప్రోగ్రామ్ (2025-2027) కోసం అనుబంధాన్ని మంజూరు చేసింది. ఈ కళాశాలలో 60 సీట్లతో కూడిన రెండు విభాగాలు ఉంటాయి.
వీటిలో అప్‌గ్రేడ్ అయిన ఫ్యాకల్టీ, స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు, ఈ-జర్నల్స్‌తో కూడిన ఆధునిక లైబ్రరీ, BCI నిబంధనల ప్రకారం స్మార్ట్ మౌలిక సదుపాయాలు ఉంటాయి. లా కళాశాల అభివృద్ధికి రూ.22.96 కోట్లు కూడా మంజూరు అయ్యాయి. తెలంగాణలో న్యాయ విద్యను బలోపేతం చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎక్స్ పోస్ట్‌లో కృతజ్ఞతలు తెలిపారు. ఈ చర్య మెరుగైన నాణ్యత, పారదర్శకత, భవిష్యత్ న్యాయ నిపుణులకు మెరుగైన అవకాశాలను నిర్ధారిస్తుందని అన్నారు. లా కాలేజీకి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమోదం పొందడానికి బండి సంజయ్ చొరవ తీసుకున్నారు.