ఏపీ ఈసెట్‌-2022 ఫలితాలు విడుదల

AP ECET 2022 results out.ఏపీ ఈసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. బుధ‌వారం పరీక్షా ఫ‌లితాల‌ను ఉన్నత విద్యామండలి చైర్మన్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Aug 2022 12:46 PM IST
ఏపీ ఈసెట్‌-2022 ఫలితాలు విడుదల

ఏపీ ఈసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. బుధ‌వారం పరీక్షా ఫ‌లితాల‌ను ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి విడుద‌ల చేశారు. ఈ పరీక్షలో 92.36 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఫ‌లితాల్లో కూడా బాలిక‌లే పై చేయి సాధించారు. బాలురు 91.44 శాతం ఉత్తీర్ణ‌త సాధించ‌గా బాలికలు 95.68 శాతం ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థులు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://cets.apsche.ap.gov.in/ ‌లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు.

ఈ సంద‌ర్భంగా విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ మొత్తం 14 విభాగాల్లో జరగాల్సిన పరీక్షకు 11 విభాగాల్లో మాత్రమే నిర్వహించామ‌న్నారు. కొన్ని కోర్సుల్లో ఉన్న సీట్లకంటే దరఖాస్తులు తక్కువ గా రావడంతో పరీక్ష నిర్వహించలేదని తెలిపారు. సిరామిక్ ఇంజనీరింగ్, బీఎస్సీ గణితం కి తక్కువ దరఖాస్తులు రాగా, బయోటెక్ కు ఎవ్వరు దరఖాస్తు చేయలేదన్నారు.

ఇంజనీరింగ్ కోర్సుల్లో సెకండ్ ఇయ‌ర్‌లో ప్రవేశానికి డిప్లోమా విద్యార్థులకు ఏపీ ఈసెట్ పరీక్షను నిర్వ‌హిస్తారు. ఈ సారి ప‌రీక్ష‌కు మొత్తం 38,801 మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకున్నారు. జూలై 22న ఆన్‌విధానంలో ఈ ప‌రీక్ష‌ను నిర్వ‌హించారు. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ (ఈఈఈ), అగ్రికల్చర్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ), కెమికల్ ఇంజినీరింగ్ కోర్సులకు సంబంధించి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరిగింది. ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈసీఈ), ఫార్మసీ, మెటలర్జికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ (ఈఐఈ), మెకానికల్ ఇంజినీరింగ్, మైనింగ్ ఇంజినీరింగ్ కోర్సులకు సంబంధించి మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష జరిగింది. 38,801 మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకోగా 36,440 మంది విద్యార్థులు రాశారు.

Next Story