భారత విద్యార్థులకు ముఖ్య ఎంపికగా మారిపోయిన యునైటెడ్ స్టేట్స్: గ్లోరియా బెర్బెనా

2 Lakh Indians chose US for higher education in 21-22.వరుసగా రెండో ఏడాది కూడా భారతీయ విద్యార్థులు ఉన్నత

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  17 Nov 2022 2:53 PM IST
భారత విద్యార్థులకు ముఖ్య ఎంపికగా మారిపోయిన యునైటెడ్ స్టేట్స్: గ్లోరియా బెర్బెనా

వరుసగా రెండో ఏడాది కూడా రికార్డు స్థాయిలో భారతీయ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు అమెరికాకు వచ్చారు. ఈరోజు విడుదల చేసిన ఓపెన్ డోర్స్ నివేదిక ప్రకారం, 2021-22 విద్యా సంవత్సరంలో దాదాపు 200,000 మంది భారతీయ విద్యార్థులు యునైటెడ్ స్టేట్స్‌ను తమ ఉన్నత విద్యకు గమ్యస్థానంగా ఎంచుకున్నారు. అమెరికాలో చదువుల కోసం భారతీయులు వెళ్లడం గత సంవత్సరం కంటే 19 శాతం పెరిగింది. యునైటెడ్ స్టేట్స్‌లో చదువుతున్న ఒక మిలియన్ విదేశీ విద్యార్థులలో దాదాపు 21 శాతం మంది భారతీయ విద్యార్థులు ఉన్నారంటే అమెరికాలో చదవడానికి భారతీయులు ఎంతగా ఇష్టపడుతూ ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. 2021–22లో అమెరికాలో 9.48 లక్షల మంది విదేశీ విద్యార్థులు ప్రవేశాలు పొందగా వారిలో 21 శాతం (1,99,182 మంది) భారతీయులే ఉన్నారు. 2020–21తో పోలిస్తే ఇది 18 శాతం ఎక్కువని ఓపెన్‌ డోర్స్‌ సంస్థ నివేదిక వెల్లడించింది. కరోనా వైరస్‌ ప్రభావం తగ్గడంతో 2021–22లో అడ్మిషన్లు భారీగా పెరిగాయి. అమెరికాలో 9,48,519 మంది విదేశీ విద్యార్థులున్నారని ప్రభుత్వం వెల్లడించింది. వీరిలో 21.1 శాతం (2 లక్షలు) మ్యాథ్స్, కంప్యూటర్‌ సైన్స్, 19.8 శాతం (1.88 లక్షలు) ఇంజనీరింగ్‌ చదువుతున్నారు.

'మినిస్టర్‌ కౌన్సెలర్‌ ఫర్‌ పబ్లిక్‌ డిప్లొమసీ' గ్లోరియా బెర్బెనా మాట్లాడుతూ, "ఉన్నత విద్య కోసం యునైటెడ్ స్టేట్స్‌ను ఎంచుకునే విద్యార్థుల సంఖ్య భారీగా పెరుగుతోందని.. ముఖ్యంగా భారత్ ఇందులో అగ్రగామిగా ఉన్నందుకు ఎంతో ఆనందంగా ఉందని.. అందుకు భారతదేశానికి అభినందనలు చెబుతున్నాను" అని అన్నారు. భారతీయ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు U.S. విద్యలో విలువను గుర్తించారని.. ప్రపంచంలోని సవాళ్లను ఎదుర్కోవడంలో కొత్తగా సంపాదించిన జ్ఞానాన్ని ఉపయోగించుకునేలా వారిని సిద్ధం చేస్తుందని తెలిపారు.

భారతీయ విద్యార్థులకు సహాయం చేయడానికి, U.S. డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ ముందుకు వచ్చింది. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ న్యూ ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, అహ్మదాబాద్, ముంబై మరియు హైదరాబాద్ లో ఎనిమిది 'ఎడ్యుకేషన్ యూఎస్ఏ' సలహా కేంద్రాలలో భావి భారతీయ విద్యార్థులకు వర్చువల్‌గా మరియు వ్యక్తిగతంగా ఉచిత సలహా సేవలను అందిస్తుంది. అన్ని కేంద్రాలలో ఎడ్యుకేషన్ యూఎస్ఏ సలహాదారులు ఉన్నారు. వారు యునైటెడ్ స్టేట్స్‌లో చదువుకోవడానికి అవకాశాల గురించి ఖచ్చితమైన, సమగ్రమైన మరియు తాజా సమాచారాన్ని అందిస్తారు. భారతీయ విద్యార్థులు 4,000 గుర్తింపు పొందిన యూఎస్ ఉన్నత విద్యా సంస్థల నుండి ఉత్తమ ప్రోగ్రామ్‌ను కనుగొనడంలోనూ.. ఏయే విద్యార్థులకు ఎలాంటి యూనివర్సిటీలు సరిపోతాయో తెలియజేయడంలో సహాయపడతారు.

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ యూఎస్ లోని అంతర్జాతీయ విద్యార్థుల పై వార్షిక గణాంక సర్వేను నిర్వహిస్తుంది. 1972 నుండి యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ యొక్క బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ అఫైర్స్‌తో భాగస్వామ్యం కలిగి ఉంది. యునైటెడ్ స్టేట్స్‌లో చదువుకోవడం గురించి అదనపు వివరాలను కోరుకునే విద్యార్థులు, కుటుంబాలు iOS మరియు Android పరికరాలలో ఉచితంగా అందుబాటులో ఉండే EducationUSA ఇండియా యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ కళాశాల దరఖాస్తు ప్రక్రియ గురించి తాజా సమాచారాన్ని అందిస్తుంది. యునైటెడ్ స్టేట్స్‌లో ఉన్నత విద్యను ప్లాన్ చేయడానికి పలు వివరాలను అందజేస్తుంది. లేదంటే https://educationusa.state.gov/country/in సైట్ కు వెళ్ళండి.

U.S. డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ అఫైర్స్:

U.S. డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ యొక్క బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ అఫైర్స్ (ECA) యునైటెడ్ స్టేట్స్, ఇతర దేశాల ప్రజల మధ్య విద్యా, సాంస్కృతిక, క్రీడలు, వృత్తిపరమైన, ప్రైవేట్ రంగ మార్పిడి, అలాగే ప్రభుత్వ-ప్రైవేట్ ద్వారా సంబంధాలను ఏర్పరుస్తుంది. ఫ్లాగ్‌షిప్ ఫుల్‌బ్రైట్ ప్రోగ్రామ్, ఇంటర్నేషనల్ విజిటర్ లీడర్‌షిప్ ప్రోగ్రామ్‌తో సహా ఈ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌లను ఏటా దాదాపు 50,000 మంది భాగస్వాములు ఉంటారు. ECA ఆర్థిక అవసరాలు ఉన్న US అండర్ గ్రాడ్యుయేట్‌ల కోసం బెంజమిన్ A. గిల్మాన్ స్కాలర్‌షిప్‌లు, విదేశాలలో US విదేశీ భాషా అధ్యయనానికి మద్దతుగా క్రిటికల్ లాంగ్వేజ్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్, ప్రపంచవ్యాప్తంగా 400 కంటే ఎక్కువ సలహా కేంద్రాల ఎడ్యుకేషన్USA నెట్‌వర్క్‌ను స్పాన్సర్ చేస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులలో ఎవరైతే యునైటెడ్ స్టేట్స్ లో చదువుకోవాలనుకుంటున్నారో వారికి కావాల్సిన సమాచారాన్ని అందిస్తుంది. మరింత సమాచారం కోసం, eca.state.govని సందర్శించండి.


Next Story