గవర్నర్‌ను కలవనున్న ఈసీ.. ఏం నిర్ణయం తీసుకుంటారో !
By Newsmeter.Network
ఏపీలో ఈసీ వర్సెస్ వైకాపా ప్రభుత్వం అన్నట్లుగా మారింది. కరోనా వైరస్ ప్రభావంతో దేశవ్యాప్తంగా కేంద్రం హై అలర్ట్ ప్రకటించింది. పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ప్రస్తుతం ఏపీలో స్థానిక పోరు రంజుగా సాగుతుంది. ఈ నెలాఖరులో అన్ని స్థానిక ఎన్నికలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా ఎఫెక్ట్ ఈ ఎన్నికలపై పడింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ఎన్నికలను ఆరు నెలలు వాయిదావేస్తూ కీలక నిర్ణయం ప్రకటించారు. దీంతో సీఎం జగన్మోహన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో తప్పుబట్టారు. వెంటనే గవర్నర్‌ను కలిసి ఎస్‌ఈసీ కమిషనర్ రమేష్ కుమార్‌పై ఫిర్యాదు చేశారు.
దీనికితోడు వెంటనే విలేకరుల సమావేశం నిర్వహించింది. రమేష్ కుమార్ నిర్ణయం తనను తీవ్రంగా బాధించిందని, మార్చి చివరి నాటికి ఎన్నికలు జరగకుండా ఉంటే రాష్ట్రానికి రావాల్సిన నిధులు వెనక్కు వెళ్లిపోతాయని అన్నారు. ఇదే సమయంలో ఎన్నికల వాయిదా వెనుక చంద్రబాబు ఉన్నాడని జగన్ ఆరోపించారు. రమేష్ కుమార్‌ను ఎస్‌ఈసీ కమిషనర్‌గా నియమించింది చంద్రబాబేనని, ఆయన సామాజిక వర్గం వ్యక్తిని నియమించుకున్నాడని, ఇ ప్పుడు చంద్రబాబు సూచనతోనే రమేష్‌బాబు ఎన్నికలను వాయిదా వేశాడని జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం నడుపుతుంది 150 సీట్లు వచ్చిన మేమా..? రమేష్ కుమారా? అంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే సోమవారం ఉదయం ఏపీ సీఎస్ నీలమ్ సాహ్ని ఈసీకి లేఖ రాశారు. తమను సంప్రదించి ఉంటే కరోనా వైరస్ పరిస్థితిపై సరైన సమాధానం ఇచ్చేవాళ్లమని, ఇప్పటికైన మీ నిర్ణయాన్ని మార్చుకొని అనుకున్న సమయానికి ఎన్నికలు నిర్వహించేలా చూడాలని లేఖలో కోరారు. ఇదిలా ఉంటే రాష్ట్ర ఎన్నికల కమిషన్ రమేష్ కుమార్ మరికొద్ది సేపట్లలో గవర్నర్ ను కలవనున్నారు. ఎన్నికలు వాయిదా వేయడానికి గల కారణాలు, అందుకు సంబంధించిన పలు అంశాలపై రమేష్ కుమార్ గవర్నర్ హరిచందన్ కు వివరించనున్నారు.
ఎస్‌ఈసీ వివరణ విన్న తరువాత గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఏ విధంగా ఈ వివాదానికి తెర దించుతారనే అంశంగా ఉత్కంఠగా మారింది. మరోవైపు ఎస్‌ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైకాపా ప్రభుత్వం సుప్రీంకోర్టుకుసైతం వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. గవర్నర్ నుంచి సానుకూల ప్రకటన రాకుంటే సుప్రింకో ర్టును ఆశ్రయించేందుకు జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా అంశం ఇప్పుడు ఏపీలో హాట్‌టాపిక్‌గా మారడంతో పాటు రాజకీయ వేడిని మరింత రాజేసింది.