సుప్రీం కోర్టులో కమల్‌నాథ్‌కు ఊరట

By సుభాష్  Published on  2 Nov 2020 4:12 PM IST
సుప్రీం కోర్టులో కమల్‌నాథ్‌కు ఊరట

మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఎన్నికల కమిషన్‌ ఆదేశాలపై స్టే విధిస్తున్నట్లు ఈసీకి ఎలాంటి అధికారం లేదంటూ సీజేఐ ఎస్‌ ఏ బాబ్డే అన్నారు. కమల్‌ నాథ్‌ స్టార్‌ క్యాంపెయినర్‌ను రద్దు చేస్తూ శనివారం ఎన్నికల కమిషన్‌ తీసుకున్న నిర్ణయంపై కమల్‌నాథ్‌ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, ఎన్నికల కమిషన్‌ ఆదేశాలపై స్టే విధించింది సుప్రీం కోర్టు.

పదేపదే ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడం , ఎన్నికల కమిషన్‌ చేసిన హెచ్చరికలను పూర్తిగా బేఖాతరు చేసిన నేపథ్యంలో కమల్‌నాథ్‌కు ఉన్నస్టార్‌ క్యాంపెయినర్‌ను తొలగిస్తున్నట్లు ఎన్నికల సంఘం అక్టోబర్‌ 30న ప్రకటించింది. ఒకవేళ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే ఆయ‌న ప్రయాణ, బస సహా ఇతర ఖర్చు, ఆయన ఏ నియోజకవర్గంలో క్యాంపెయిన్‌ చేస్తున్నారో ఆ నియోజకవర్గంలో పోటీలో ఉన్న కాంగ్రెస్‌ అభ్యర్థి తన ఎన్నికల ఖర్చు నుంచి భరించాల్సి ఉంటుందని ఎన్నికల సంఘం తెలిపింది.

అయితే స్టార్‌ క్యాంపెయినర్‌ల ఖర్చులు పరిమితులు లేని పార్టీ అకౌంట్‌కు వెళ్లాయి. ఎన్నికల సంఘం ప్రకటనపై కాంగ్రెస్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా, కమల్‌నాథ్‌ కోర్టును ఆశ్రయించారు. దీంతో విచారించిన కోర్టు.. ఈసి నిర్ణయంపై సుప్రీం కోర్టు స్టే విధించింది.

ఈ ఏడాది మార్చిలో మధ్యప్రదేశ్‌లో 22 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో కమల్‌ నాథ్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోయి శివారాజ్‌ సింగ్‌ చౌహాన్‌ నేతృత్వంలో బీజేపీ సర్కార్‌ ఏర్పాటు అయింది. ప్రస్తుతం ఆ 22 మంది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. వాటితో పాటు మరో 6 స్థానాలకు కూడా ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 28 స్థానాలకు నవంబర్‌ 3న ఉప ఎన్నికలు జరుగనున్నాయి.

Next Story