టర్కీ, ఇరాన్ సరిహద్దుల్లో భారీ భూకంపం..

By అంజి  Published on  24 Feb 2020 2:51 AM GMT
టర్కీ, ఇరాన్ సరిహద్దుల్లో భారీ భూకంపం..

టర్కీ, ఇరాన్ సరిహద్దుల్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.7 పాయింట్లుగా భూ ప్రకంపనలు నమోదయ్యాయి. ప్రధానంగా గెర్జె కౌంటీలో భూకంప ప్రకంపనల ప్రభావం కనిపించింది. భూమిలోపల 9 కిలో మీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. చాలా చోట్ల ఇండ్లు, భవనాలు కూలిపోయాయి. టర్కీలో పరిధిలోని భూభాగంలో తొమ్మిది మంది చనిపోయారు. 21 మంది గాయపడ్డారు. కూలిపోయిన ఇండ్లు, భవనాల కింద ఎంత మంది చిక్కుకుపోయారన్నది ఇప్పటికీ తేలలేదు.

మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. చనిపోయినవారిలో ముగ్గురు పిల్లలు ఉన్నారని, గాయపడినవారిలోనూ కొందరి పరిస్థితి విషమంగా ఉందని ప్రకటించారు. టర్కీ సరిహద్దులకు పది కిలోమీటర్ల దూరంలో ఇరాన్ లోని హబాష్ ఓల్యా ప్రాంతంలో, ఉపరితలానికి 9 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉందని అమెరికన్ జియాలాజికల్ సర్వే విభాగం ప్రకటించింది. దాని ప్రభావం ఇరు రాష్ట్రాలపైనా ఉందని తెలిపింది. అటు ఇరాన్ వైపు కూడా భారీగా నష్టం జరిగింది. వెస్ట్ అజర్ బైజాన్ ప్రాంతంలోని గ్రామాల్లో పెద్ద సంఖ్యలో ఇళ్లు కూలిపోయాయని ఇరాన్ అధికారులు తెలిపారు. పదుల సంఖ్యలో జనం గాయాలపాలయ్యారని, భారీగా ఆస్తినష్టం జరిగిందని వెల్లడించారు.

ట‌ర్కీలో గత నెలలో కూడా శ‌క్తివంత‌మైన భూకంపం వ‌చ్చింది. అప్పుడు సుమారు 60 సార్లు భూ ప్ర‌కంప‌న‌లు న‌మోదు అయ్యాయి. భూకంప తీవ్ర‌త 6.8గా గుర్తించారు. భూకంపం వ‌ల్ల 18 మంది మృతిచెందారు. ఇక 1999లో ట‌ర్కీలో వ‌చ్చిన భూకంపంలో సుమారు 17వేల మంది మ‌ర‌ణించారు.



Next Story