నెలరోజులైనా ఈ కామర్స్ లలో తగ్గని ఆఫర్లు

By రాణి  Published on  28 Jan 2020 12:45 PM GMT
నెలరోజులైనా ఈ కామర్స్ లలో తగ్గని ఆఫర్లు

కొత్త సంవత్సరం వచ్చి ఇన్నిరోజులైనా ఆ వెబ్ సైట్లలో ఆఫర్లు మాత్రం తగ్గలేదు. ఆఫర్లకు ఆకర్షితులవుతున్న వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతూనే ఉన్నాయి. ఏ పండుగ వచ్చిన కస్టమర్ల జేబులు ఖాళీ చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండే టెక్నో మార్కెట్లు...ఇప్పటికి కూడా డిస్కౌంట్ల మీద డిస్కౌంట్లు ఇస్తున్నాయి. ఆ వెబ్ సైట్లు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లు అనుకుంటే మాత్రం పొరపాటే. అవి చైనీస్ ఈ కామర్స్ వెబ్ సైట్లు. చైనా ఉత్పత్తులే కాకుండా...చైనీస్ ఈ కామర్స్ కూడా ఇండియా మీద కన్నేశాయి. భారత కాలమానం ప్రకారం ఈ నెల 25న చైనాకు న్యూ ఇయర్ వచ్చింది. కానీ..న్యూ ఇయర్ ముందునుంచీ మొదలైన ఆఫర్లు మాత్రం ఇంకా అలాగే కొనసాగుతున్నాయి. ఈ చైనీస్ మార్కెట్లు..కస్టమర్లను ఆకర్షించేందుకు వేలకొద్దీ వస్తువులపై ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. బ్యాంగ్ గుడ్, జీక్ బైయింగ్, టాప్ టాప్ వంటి చైనీస్ వెబ్ సైట్లు తక్కువ ధరలకే ఎలక్ర్టానిక్ గాడ్జెట్స్ అంటూ ఇండియా మార్కెట్ పై దాడి చేస్తున్నాయి. దీంతో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లలో కన్నా చైనీస్ ఈ కామర్స్ లలో తక్కువధరలకే గాడ్జెట్స్, ఇతర వస్తువులు లభిస్తుండటంతో..జనం కూడా వాటివైపే మక్కువ చూపుతున్నారు. తక్కువ ధరలకే గాడ్జెట్స్ ఇస్తామని చెప్పుకుంటూ...చైనా ఈ కామర్స్ నెమ్మదిగా ఇండియాలో పాగా వేసేందుకు ప్లాన్ చేస్తున్నాయి.

పండుగ సందర్భాన్ని బట్టి ఫ్లిప్ కార్ట్, అమెజాన్, క్లబ్ ఫ్యాక్టరీ తదితర ఈ కామర్స్ సంస్థలు వివిధ వస్తువులపై ఆఫర్లు ప్రకటించడం షరా మామూలే. అయితే ఇవి ప్రకటించే ఆఫర్లు రెండు మూడ్రోజులే ఉంటాయి. ఆ రోజుల్లో కొన్నవారు మాత్రం తాము చాలా లక్కీ...తక్కువ ధరకే ఫలానా వస్తువును కొన్నాం అని సంతోషపడిపోతుంటారు. ఇప్పుడు చైనీస్ వెబ్ సైట్ల దెబ్బకు ఫ్లిప్ కార్ట్, అమెజాన్ పప్పులేమీ ఉడకవేమో. దీని దెబ్బకు మిగతా ఈ కామర్స్ సంగతేంటో మరి..కాస్త జాగ్రత్తగా ఉండండి.

Next Story