దొంగ ఓట్లకు చెక్ పెట్టే సమయం వచ్చేసిందా..?
By రాణి Published on 19 Feb 2020 6:24 PM IST
ఎన్నికల్లో దొంగ ఓట్లు వేస్తూ ఉన్న వాళ్ళు ఎంత మందో ఉన్నారు. బోర్డర్ లో ఉన్న రాష్ట్రాల్లో కొందరైతే ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఓటు వేస్తూ ఉంటారు.. ఈ రాష్ట్రంలో ఎలక్షన్స్ ఉన్నా ఓటు వేస్తూ ఉంటారు. కొందరికి పల్లెల్లో ఓటు ఉంటాయి.. టౌన్ లోనూ ఓటు ఉంటాయి..! ఒకప్పుడు ఇలాంటి అవకతవకలు భారీగా జరిగేవి.. ఈ మధ్య కాలంలో బాగా తగ్గుముఖం పట్టాయి. గత కొన్నేళ్లుగా ఎలక్షన్ కమీషన్ దొంగ ఓట్లను తీసివేసే పనిలోనే ఉంది. ఇంకా పరిస్థితిలో మార్పులు రావాల్సి ఉంది. అందుకే ఓటరు జాబితాతో ఆధార్ నెంబర్‌ను అనుసంధానించడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. డూప్లికేట్ ఓటర్ లను తీసి పారేసి.. అసలైన ఓటర్ కు నాయకున్ని ఎంచుకునే 'రిమోట్' ఇవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఓటర్లుగా నమోదు చేసుకోవాలనుకునే వారు, ఇప్పటికే ఓటర్లుగా నమోదైనవారు తమ ఆధార్ నెంబర్‌ను అనుసంధానం చేసుకోవాలని కోరేందుకు వీలుగా ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరించాలని కోరుతూ ఎన్నికల సంఘం కేంద్ర న్యాయ శాఖకు లేఖ రాయగా.. అందుకు న్యాయ శాఖ కూడా సమ్మతం తెలిపింది. ఈ ప్రతిపాదనతో పాటూ మరికొన్నింటిని ఎన్నికల సంఘం కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లింది.
ఎన్నికల సంస్కరణలకు సంబంధించిన దాదాపు 40 ప్రతిపాదనలు చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న విషయాన్ని న్యాయశాఖ దృష్టికి తీసుకువెళ్లారు. 20 మంది చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లు, పలువురు ఎన్నికల సంఘం అధికారులతో కూడిన 9 బృందాలు తాము రూపొందించిన సంస్కరణల ప్రతిపాదనలను ఎన్నికల సంఘానికి సమర్పించాయి.
ఇక ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్లు, ఎన్నికల సమయంలో ఇష్టమొచ్చినట్లు వార్తలను సృష్టించే వాళ్ళను కూడా అడ్డుకోవాలని ఎలక్షన్ కమీషన్ భావిస్తోంది. తప్పుడు అఫిడవిట్లు, చెల్లింపు వార్తలను ఎన్నికల నేరాలుగా పరిగణించాలని ఎన్నికల సంఘం కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లింది. ప్రధాన ఎన్నికల అధికారి సునీల్ అరోరా, కమిషనర్లు అశోక్ లావాసా, సుశీల్ చంద్ర మంగళవారం నాడు లెజిస్లేటివ్ సెక్రటరీ నారాయణరాజుతో భేటీ అయ్యారు. కొన్ని సంవత్సరాలుగా అలాగే ఉండిపోయిన నియమ నిబంధనలను మార్చాలని ఈ భేటీలో నిర్ణయించారు.