ప్రారంభమైన దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్
By సుభాష్ Published on 3 Nov 2020 2:11 AM GMTదివంగత టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో ఖాళీ అయిన దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు ఓటు వేసేందుకు క్యూలైన్‌లో బారులు తీరారు. సాయంత్రం 6 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగనుంది. నియోజకవర్గ పరిధిలో 315 పోలింగ్ కేంద్రాలుండగా, వాటిని 32 సెక్టార్లుగా విభజించారు అధికారులు. పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
పోలింగ్ జరిగే ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. భారీ బందోబస్తు మధ్య ఈ పోలింగ్ కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో ముఖ్యంగా టీఆర్‌ఎస్ నుంచి సుజాత రామలింగారెడ్డి, బీజేపీ నుంచి రఘునందన్‌రావు, కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు. హోరాహోరీగా సాగిన ప్రచారంలో ఎన్నో ఘర్షణలు, ఆందోళనలతో చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం రాష్ట్రం మొత్తం ఈ ఉప ఎన్నికపైనే దృష్టి ఉంది. కాగా, ఈ నెల 10 ఓట్ల లెక్కింపు జరగనుంది.