కరోనాతో డీఎస్పీ మృతి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 Aug 2020 2:15 PM GMT
కరోనాతో డీఎస్పీ మృతి

కరోనా ఎవ‌రిని వ‌ద‌ల‌ట్లేదు. రోజు రోజుకు కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. కరోనాను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటునప్పటికీ వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంలేదు. సాధారణ ప్రజలతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం కరోనా బారినపడటం ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా కరోనాను కట్టడి చేయటంలో ప్రంట్‌లైన్ వారియ‌ర్స్‌గా ప్రముఖ పాత్ర పోషిస్తున్న పోలీసులు ఎక్కువగా వైరస్ బారిన పడుతున్నారు.

తాజాగా.. మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాల‌యంలో ఏఆర్ విభాగంలో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న పీ. ఎస్. శశిధర్ కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ నాంపల్లి కేర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే ఆయనకు ఇదివరకే ఇతర వైద్యసమస్యలు ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. డిఎస్పీ శశిధర్ మృతిపై జిల్లా పోలీస్ అధికారులు సంతాపం తెలిపారు.

శశిధర్ మరణం పట్ల మహబూబాబాద్ జిల్లా ఎస్పీ ఎన్. కోటిరెడ్డి మాట్లాడుతూ .. శశిధర్ మహబూబాబాద్ జిల్లా లో గ‌త ఒక‌టిన్న‌ర‌ సంవత్సరంగా సేవలు అందిస్తున్నార‌ని తెలిపారు. ఆయ‌న మ‌ర‌ణంతో జిల్లా పోలీసు విభాగం తీవ్ర దిగ్భ్రాంతికి గుర‌య్యింద‌న్నారు. శ‌శిధ‌ర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఇదిలావుంటే..1996 బ్యాచ్ ఆర్ఎస్ఐ గా పోలీస్ శాఖలో చేరిన శ‌శిధ‌ర్‌.. మొద‌ట‌గా బెల్లంపల్లి హెడ్ క్వార్టర్స్ లో విధులు నిర్వహించారు. ఆ తర్వాత ఆర్ఐ కరీంనగర్, ఆర్ఐ సిరిసిల్ల, డీఎస్పీ ప్రమోషన్ లో బాగంగా డీఎస్పీగా మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంకి వచ్చారు.

ఇదిలావుంటే.. ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం గడిచిన 24 గంటల్లో కొత్తగా 1256 కేసులు, 10 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 80,751కి, మరణాల సంఖ్య 637కు పెరిగాయి. రాష్ట్రంలో రికవరీలు కూడా మెరుగ్గా ఉండటంతో ఇప్పటికే 57,586 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 22,528గా ఉంది.

Next Story