డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డ మహిళలు

By సుభాష్  Published on  19 Jan 2020 5:06 AM GMT
డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డ మహిళలు

హైదరాబాద్ నగరంలో మద్యం సేవించి వాహనాలు నడపకుండా ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోతోంది. అర్ధరాత్రి సమయంలో మద్యం తాగి వాహనాలు నడుపుతూ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడి కేసుల పాలవుతున్నా మందుబాబుల తీరు మారడం లేదు. తాజాగా జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ ప్రాంతాల్లో శనివారం అర్ధరాత్రి నుంచి డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో పెద్ద ఎత్తున వాహన దారులు పట్టుబడ్డారు. ఫుల్లుగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 32 మందిని పట్టుకుని కేసులు నమోదు చేశారు ట్రాఫిక్‌ పోలీసులు. పట్టుబడిన వారిలో నలుగురు మహిళలు ఉండడం గమనార్హం. ఈ తనిఖీల్లో 16 కార్లు, 16 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు.

మందు బాబుకు నోటీసులు జారీ

ఈ డ్రంక్‌అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడిన వారందరికీ ట్రాఫిక్‌ పోలీసులు నోటీసులు జారీ చేశారు. సోమవారం బేగంపేటలోని ట్రాఫిక్‌ శిక్షణ కేంద్రంలో కుటుంబ సభ్యులతో హాజరు కావాలని నోటీసులలో పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో వీరికి కౌన్సిలింగ్‌ ఇవ్వనున్నారు. ఇక పట్టుబడిన వారిని మంగళవారం కోర్టులో ప్రవేశ పెట్టనున్నట్లు పోలీసులు తెలిపారు

ఇరవై రోజుల్లోనే 1800పైగా కేసులు

మద్య తాగకుండా వాహనాలు నడపాలని పోలీసులు సూచిస్తున్నా.. వాహనదారులు పెడచెవిన పెడుతున్నారు. డిసెంబర్‌ 31 నుంచి ఇప్పటి వరకు నిర్వహించిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లలో 1800పైగా కేసులు నమోదైనట్లు ట్రాఫిక్‌ పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలోనే ఎక్కువగా కేసులు నమోదు కావడం విశేషం. ఈ ప్రాంతంలోనే 1824 కేసులు నమోదయ్యాయి.

Next Story