ముఖ్యాంశాలు

  • టీటీడీ లో అన్యమత ప్రచారంపై మంత్రి సవాల్

తిరుమల కొండపై ఏసుక్రీస్తు శిలువ ఉందని నిరూపిస్తే రాజీనామా చేస్తా.. శిలువ లేకపోతే లోకేష్ రాజీనామా చేస్తారా అని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ టీడీపీ ఎమ్మెల్సీ లోకేష్ కు సవాల్ విసిరారు. టీటీడీలో అన్యమత ప్రచారంపై ఏపీ శాసన మండలిలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్యుద్ధం జరిగింది. అన్యమత ప్రచారంలో లోకేష్ హస్తం ఉందని, సోషల్ మీడియా ద్వారా లోకేష్ అన్యమత ప్రచారం చేయిస్తూ ఆ నేరాన్ని ప్రభుత్వం పై నెట్టి ఇరకాటంలో పెట్టాలని చూస్తున్నారని వెల్లంపల్లి ఆరోపించారు.

మంత్రి వెల్లంపల్లి చేసిన సవాల్ కు ఎమ్మెల్సీ నారా లోకేష్ మండలిలోనే స్పందించారు. మంత్రి తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయలేకపోతే తన పదవికి రాజీనామా చేస్తారా అని లోకేష్ ప్రతి సవాల్ చేశారు. ఇలా మాటలయుద్ధం జరుగుతుండగానే మంత్రి చేసిన వ్యాఖ్యలను నిరూపించాల్సిందేనని సభా సభ్యులు పట్టుబట్టారు. ఇంతలోనే మంత్రి కలుగజేసుకుని టీటీడీ కొండపై శిలువ ఉండటం సోషల్ మీడియా క్రియేటివిటీ అని, మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకే టీడీపీ ఇలా కుట్ర పన్నిందని ఆరోపించారు. టీటీడీలో అన్యమత ప్రచారం జరగటం అవాస్తవమని, తిరుమలేషుడితో రాజకీయాలొద్దని ఆయన హితవు పలికారు. ఇప్పటికే టీడీపీ నాశనమయిందని, కలియుగ దైవంతో రాజకీయాలు చేస్తే నామరూపాల్లేకుండా పోతారని వెల్లంపల్లి వ్యాఖ్యానించారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.