ఎన్నికలకు, ఆర్థిక సంఘం నిధులకు లింక్ పెట్టొద్దు.. – ఎస్ఈసీ
By Newsmeter.Network
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై ఎస్‌ఈసీ వర్సెస్ వైకాపా ప్రభుత్వం మధ్య పోరు సాగుతూనే ఉంది. వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం పేర్కొంటుండగా.. ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని ఎస్‌ఈసీ స్పష్టం చేస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు పునః సమీక్ష చేయాలంటూ సోమవారం ఏపీ సీఎస్ నీలం సాహ్నీ ఈసీకి లేఖ రాశారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని, వాటిని ఇకపైనా కొనసాగిస్తుందని ఆమె లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం కరోనా వైరస్ రాకుండా చేపట్టిన చర్యలకు సంబంధించి వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఇచ్చిన ఆరు పేజీల నివేదికను లేఖకు సీఎస్ జతచేసి పంపించారు. మరోవైపు ఎన్నికలు నిర్వహించకుంటే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోతాయని ఆ లేఖలో సీఎస్ పేర్కొన్నారు.
Also Read :ఏపీలో ఎస్ఈసీ వర్సెస్ వైసీపీ ప్రభుత్వం.. చివరికి నెగ్గేదెవరు?
ఇదిలా ఉంటే మంగళవారం ఈసీ రమేష్ కుమార్ ఏపీ సీఎస్ లేఖకు బదులిచ్చారు. ఏపీలో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించలేమని స్పష్టం చేశారు. కరోనా వైరస్ ప్రభావంతో ఎన్నికలు వాయిదా వేశామని, కరోనా ప్రభావంతో ఇప్పటికే మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒడిశాలలో ఎన్నికలు వాయిదా పడినట్లు, గోవాలో కూడా ఎన్నికలు వాయిదా వేయాలని చూస్తున్నారని రమేష్ తెలిపారు. ఎన్నికలకు, ఆర్థిక సంఘం నిధులకు లింక్ పెట్టొద్దని ఎస్‌ఈసీ రమేష్ కుమార్ సూచించారు. ఎన్నికలు నిర్వహించకుంటే నిధులు రావని అనడం సరికాదని పేర్కొన్నారు. గతంలో రాజ్‌భవన్‌లో కంటే ముందు ఆర్థిక శాఖలో ఫైనాన్స్ వ్యవహారాలు చూశానని, ఆర్థిక వ్యవహారాలపై నాకు పూర్తి అవగాహన ఉందని అన్నారు. గతంలో కూడా ఇదేవిధంగా ఎన్నికలు నిలిపివేసినా కేంద్రం నుంచి నిధులు వచ్చిన సందర్భాలు ఉన్నాయని అన్నారు.
ఎస్‌ఈసీ తాజా లేఖతో ఎన్నికలు నిర్వహించేందుకు సుముఖంగా లేమని స్పష్టమవ్వటంతో వైసీపీ ప్రభుత్వానికి మరోసారి షాక్ తగిలినట్లయింది. ఇదిలాఉంటే స్థానిక సంస్థల ఎన్నికలను నిలిపివేయడాన్ని తప్పుబడుతూ వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. కాగా కరోనా ప్రభావంతో సుప్రీంకోర్టు కేవలం కొన్ని కేసులనే విచారిస్తామని పేర్కొనడంతో వైసీపీ ప్రభుత్వం వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. సీఎస్ లేఖ, సుప్రీంకోర్టు విచారణ ఆలస్యం కానున్న నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం ఎన్నికల నిర్వహణపై ఎలా ముందుకెళ్తుందోనన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.