ముఖం గోక్కోకండి..ముక్కు రుద్దుకోకండి..కళ్లు నులుముకోకండి
By రాణి Published on 4 March 2020 12:38 PM ISTకరోనా వ్యాప్తిని నిరోధించాలనుకుంటున్నారా? అంటు వ్యాధులను ఆపేయాలనుకుంటున్నారా? ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వైరస్ వ్యాధులకు స్వస్తి పలకాలనుకుంటున్నారా? చాలా చిన్న పని చేస్తే చాలు... వీటన్నిటినీ అదుపు చేయవచ్చు. అపజయం పాలు చేయవచ్చు. పని చాలా సింపుల్. కానీ చేయాల్సి ఉంటుంది. మీరు చేయగలరా?
పరిశోధకులు శాస్త్రవేత్తలు ఏకగ్రీవంగా చెబుతున్నటి ఒక్కటే మీ ముఖాన్ని తాకడం, రుద్దడం మానేయండి. అవును. ముక్కు గోక్కోవడం, చెంపలకు చేతులు ఆనించడం, కళ్లు నులుముకోవడం, అరచేతులతో కళ్లను మూయడం, నుదురు రుద్దుకోవడం, నోటి దగ్గరకు చేతులను పోనీయడం..ఇలాంటివి ఆపేస్తే చాలు. వైరస్ వ్యాపించడం ఆగిపోతుంది. రోజూ పలు మార్లు సబ్బుతో చేతులు కడుక్కుంటే చాలు పలు వ్యాధులు తెచ్చే బాక్టీరియా, వైరస్ పటాపంచలైపోతాయి. పోర్ట్ లాండ్ లోని ఓరెగన్ హెల్త్ అండ్ సైన్స్ యూనివర్సిటీ లో ఫ్యామిలీ మెడిసిన్ నిపుణురాలు నాన్సీ ఎల్డర్ కథనం ప్రకారం ఇవన్నీ వ్యాధుల వ్యాప్తికి ప్రధాన కారకాలు. వీటిని ట్రాన్స్ మిషన్ జోన్స్ అంటారు.
మనిషి తెలిసో తెలియకో గంటకు కనీసం 23 సార్లు ముఖాన్ని ఏదో ఒక కారణంతో తాకుతాడు. కన్ను, నోరు, ముక్కు, చెవులు - ఈ నాలుగింటిని తాకడం వల్ల అనేక అంటు వ్యాధులు వస్తాయి. మీరు ముఖాన్ని చేతులతో తాకకపోతే శ్వాస కోశ వ్యాధులు వచ్చే అవకాశం చాలా తగ్గిపోతుంది. లిఫ్ట్ ఎక్కినప్పుడు లిఫ్ట్ నాబ్ ని నొక్కుతాం. మెట్లెక్కినప్పుడు రెయిలింగ్ ను తాకుతాం. వాష్ రూమ్ తలుపులను ముట్టుకుంటాం. పదిమందిలో ఉన్నప్పుడు తుమ్మినా, దగ్గినా చేతిని నోటికి అడ్డు పెట్టుకుంటాం. ఇవే చేతులతో మనం ముఖాన్ని తాకితే తద్వారా వైరస్ మన శరీరంలోకి వ్యాపించే ప్రమాదం ఉంటుంది. మన నుంచి ఈ వస్తువులను వాడే ఇతరులకు కూడా వ్యాధి సోకుతుంది. మన శరీరంలోని మ్యూకస్ పొరలను తాకితే మనం వైరస్ కు వ్యాప్తి చెందేందుకు కనీసం పదకొండు అవకాశాలు ఇచ్చినవారమౌతాం.
ఒక టిష్యూ పేపర్ సాయంతో ముఖాన్ని తాకడం వల్ల చేతులకు అంటిన వ్యాధికారకాలు ముఖానికి చేరే అవకాశాలు తగ్గుతాయి. అలాగే ముఖానికి మేకప్ వేసుకుంటే కూడా ముఖాన్ని పదేపదే తాకడానికి మనం వెనకాడతాం. అదే విధంగా పదేపదే చేతులను సబ్బుతో కడుక్కోవడం వల్ల కూడా మనం వ్యాధుల వ్యాప్తిని నిరోధించడానికి అవకాశాలుంటాయి.