కమలా హారిస్ కంటే నా కుమార్తె ఇవాంకా బెటర్: డొనాల్డ్ ట్రంప్

By సుభాష్  Published on  29 Aug 2020 8:43 AM GMT
కమలా హారిస్ కంటే నా కుమార్తె ఇవాంకా బెటర్: డొనాల్డ్ ట్రంప్

కమలా హారిస్ అమెరికా ఉపాధ్యక్ష రేసులో నిలిచిన సంగతి తెలిసిందే. డెమోక్రాట్ల అభ్యర్థి జో బిడెన్, ఉపాధ్యక్ష పదవికి కాలిఫోర్నియా సెనెటర్ కమలా హారిస్ పేరును ప్రతిపాదించడం పట్ల అందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు.

కమలా హారిస్ ను ఉపాధ్యక్ష పదవికి జో బిడెన్ ప్రకటించినప్పటి నుండి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమెకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఒక మహిళను ఉపాధ్యక్ష పదవికి పోటీ చేయబోయే అభ్యర్థిగా బిడెన్ ఎంచుకుకోగా.. అది కొందరు పురుషులు అవమానంగా భావించే అవకాశం ఉందని అన్నారు. బిడెన్ ఒక వర్గానికి వ్యతిరేకిగా మారిపోయారని.. పురుషులకు అవమానం జరిగిందని కొందరు అనొచ్చని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే..!

తాజాగా ట్రంప్ తాను కూడా అమెరికాకు మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు రావాలని కోరుకుంటున్నానని.. అయితే ఆ పదవికి కమలా హారిస్ మాత్రం సరిపోరని చెప్పుకొచ్చారు. శుక్రవారం నాడు రిపబ్లికన్ క్యాంపెయిన్ ర్యాలీలో భాగంగా న్యూ హాంప్షైర్ లోని అభిమానులతో మాట్లాడుతూ.. తాను కూడా అమెరికాకు మహిళా ప్రెసిడెంట్ ను చూడాలని అనుకుంటూ ఉన్నానని.. అందుకు తన కుమార్తె, సీనియర్ వైట్ హౌస్ అడ్వైజర్ ఇవాంక ట్రంప్ అర్హురాలని చెబుతూ వచ్చారు. కమలా హారిస్ ఈ పదవికి అంత సమర్థురాలు కాదు.. ఆ స్థానానికి ఇవాంకా కావాలి అంటూ పలువురు కోరుతున్నారని చెప్పుకొచ్చారు ట్రంప్.

కమలా హారిస్ గత ఏడాది చివరి వరకూ ప్రెసిడెంట్ పదవి కోసం పోరాటం చేసిన సంగతి తెలిసిందే. కానీ చివర్లో ఆమెకు సరైన మద్దతు లేకపోవడంతో అధ్యక్ష పదవి రేసు నుండి వైదొలిగారు. ఆ తర్వాత జో బిడెన్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తూ ఉండగా.. కమలా హారిస్ ను ఉపాధ్యక్ష పదవికి నామినేట్ చేశారు. దీంతో ఈ ఎన్నికల్లో కాకపోయినా వచ్చే ఎన్నికల్లో కమలా హారిస్ అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశం ఉండడంతో ఇప్పటి నుండే ఆమెను ఎదగనివ్వకుండా చేయాలని ట్రంప్ భావిస్తున్నారని అక్కడి మీడియా చెబుతోంది.

'మీకు తెలుసో.. తెలీదో నేను కూడా అమెరికాకు మొట్ట మొదటి మహిళా ప్రెసిడెంట్ ను చూడాలనుకుంటున్నా.. కానీ ఆమె ప్రెసిడెంట్ పదవిని చేరుకోవాలని చేస్తున్న ప్రయత్నాలను నేను ఒప్పుకోను.. ఆమె సమర్థురాలు కాదు' అని ట్రంప్ కమలా హారిస్ ను ఉద్దేశించి అన్నారు. కమలా హారిస్ అధ్యక్ష ఎన్నికల కోసం పోటీలో నిలబడింది. కానీ కొన్ని నెలల్లోనే ఆమె మద్దతును కోల్పోయింది అంటూ చెప్పుకొచ్చారు ట్రంప్. ఆమె నేను వెళ్ళిపోవాలి కాబట్టి వెళ్ళిపోతున్నాను(ప్రెసిడెంట్ రేసు గురించి) అన్నట్లు వెళ్ళిపోయింది అని ట్రంప్ విమర్శించారు. ప్రెసిడెంట్ పదవి కోసం పోటీలో నిలిచిన జోబిడెన్ పై కూడా విమర్శణాస్త్రాలు సంధించాడు ట్రంప్.

అమెరికా అధ్యక్ష పదవికి రెండోసారి పోటీ చేస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా నామినేషన్ స్వీకరించారు. వైట్ హౌస్ సౌత్ లాన్ నుండి రిపబ్లికన్ పార్టీ తరపున నవంబరులో జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు ఆయన అధ్యక్ష పదవికి నామినేట్ అయ్యారు.

Next Story