దేశీయ వెంటిలేటర్ రూ. 7500లకే
By సుభాష్ Published on 27 March 2020 11:47 AM ISTకరోనాపై పోరులో భాగంగా దేశీయ కార్పొరేట్ సంస్థలు ఆర్ధికంగా మాత్రమే కాకుండా వైద్య పరికరాల తయారీలో సైతం పాలుపంచుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహీంద్రా గ్రూప్ ముందడుగు వేసింది. అన్ని సదుపాయాలతో కూడిన ఆధునిక వెంటిలేటర్లు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ధర పలుకుతుండగా, మహీంద్రా గ్రూప్ కేవలం రూ.7,500 కే వెంటిలేటర్ ను అందించేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఓ స్వదేశీ ఐసీయూ వెంటిలేటర్ల తయారీ సంస్థతో చేతులు కలిపిన మహీంద్రా సంస్థ చవకైన వెంటిలేటర్ల మోడళ్లను రూపొందించింది. మరో మూడు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ మోడళ్లకు ఆమోదం లభిస్తే పెద్ద ఎత్తున తయారుచేసేందుకు సన్నద్ధమైంది. కాగా, ఈ వెంటిలేటర్ కు అంబు బ్యాగ్ గా నామకరణం చేశారు. ఇది వాల్వ్ మాస్క్ ఆటోమేటెడ్ వెర్షన్ వెంటిలేటర్. తక్కువ ధరతో తాము రూపొందించే వెంటిలేటర్లు దేశంలో వెంటిలేటర్ల కొరతను గణనీయంగా తగ్గిస్తాయని మహీంద్రా వర్గాలు భావిస్తున్నాయి.
కొవిడ్‌పై పోరులో భాగంగా దేశీయ ఐసీయూ వెంటిలేటర్ల తయారీ సంస్థతో కలిసి పనిచేస్తున్నామని, అధునాతన మెషిన్ల ఖరీదు సుమారు రూ.5 నుంచి 10 లక్షల వరకు ఉండగా తాము రూపొందించిన ఈ వెంటిలేటర్ సుమారు రూ.7,500 మాత్రమే అవుతుందని అని మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. దీన్ని రూపొందించిన బృంద సభ్యులకు ధన్యవాదాలు చెబుతూ ఓ వీడియోను పోస్ట్ చేశారు.
వెంటిలేటర్ల కొరతను అధిగమిచేందుకు వెంటిలేటర్ల తయారీ సంస్థతో పాటు రెండు అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గొయెంకా ట్వీట్ చేశారు. కొవిడ్‌పై పోరాడేందుకు ఆదివారం ఆర్ధిక సహాయాన్ని ప్రకటించిన ఆనంద్ మహేంద్ర అదేరోజు వెంటిలేటర్లను తయారుచేస్తామని కూడా తెలిపారు. ఇచ్చిన మాటను తక్షణమే అమలు చేసే దిశగా వెళుతున్న ఆనంద్ మహీంద్రా, నెటిజన్ల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు.