డొక్కా రాజీనామాకు అసలు కారణమిదే..
By రాణి Published on 30 Jan 2020 12:27 PM ISTఏపీ రాజధాని వికేంద్రీకరణ బిల్లును మండలిలో ప్రవేశపెడుతున్న రోజు అది. మండలిలో టీడీపీకే బలం ఎక్కువ కావడంతో...ఖచ్చితంగా బిల్లు మండలిలో ఆమోదం పొందలేదన్న ధీమాతో ఉన్నారు తెలుగు తమ్ముళ్లు. ఇలాంటి రసవత్తరమైన పరిస్థితుల్లో టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన అనుచరులు ప్రకటనను విడుదల చేశారు. అంతే...ఆ తర్వాత ఎవరికీ టచ్ లేకుండా కనుమరుగయ్యారు డొక్కా.
తాజాగా..తాను పదవికి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో వివరించారు డొక్కా. గురువారం మీడియాతో మాట్లాడుతూ...టీడీపీ ఆలోచనా విధానం తనకు నచ్చని కారణంగానే పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. తన ఆలోచనా శైలికి..టీడీపీ ఆలోచనలు భిన్నంగా ఉన్నాయని ఆయన వివరించారు. అయితే మండలిలో జరుగుతున్న పరిణామాలు చాలా దురదృష్టకరమన్నారు డొక్కా. మండలి రద్దు తనను ఎంతగానో బాధించిందని డొక్కా వెల్లడించారు. డొక్కా రాజీనామాకు ముందు..అదే మండలిలో ఆయన జగన్ తో నవ్వుతూ మాట్లాడటం రాజకీయ వివాదానికి తెరలేపింది. ఇద్దరు కుశలప్రశ్నలు అడిగి ఒకరికొకరు అభివాదం చేసుకోవడం తెలుగు తమ్ముళ్లకు చిర్రెత్తించింది. ఇదిగో మా పార్టీ వాళ్లను అధికార పార్టీ ప్రలోభపెడుతోందంటూ విమర్శలు కూడా చేశారు. కాగా...డొక్కా తన పదవికి రాజీనామా చేశారు గానీ...టీడీపీ కి రాజీనామా చేయలేదు. దీంతో ఆయన పార్టీ మారుతారా ? లేక అదే పార్టీలో కొనసాగుతారా అన్న దానిపై సందిగ్ధం నెలకొంది.