కరోనాపై దుష్ప్రచారం చేస్తున్నారా..? అయితే జాగ్రత్త..!
By Newsmeter.Network
కరోనా వైరస్ దెబ్బతో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. దాదాపు అన్ని దేశాల్లో హై అలర్ట్ ప్రకటించారు. భారత దేశంలోనూ కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈవైరస్ లక్షణాలతో వేలాది మంది ఆస్పత్రుల బాట పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ వైరస్ ప్రభావం ఇప్పుడిప్పుడే కనిపిస్తుంది. ఏపీలో ఒక కరోనా పాజిటి్ కేసు, తెలంగాణలో ఒక పాజిటివ్ కేసు నమోదు కాగా వైరస్ లక్షణాలతో పదుల సంఖ్యలో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
కరోనా పాజిటివ్ కేసుల నమోదు పెరిగే అవకాశం ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. స్కూళ్లు, కళాశాలలు, థియేటర్లు, మాల్స్ ఇలా అన్నింటిని ఈనెల 31 వరకు మూసేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే దేశమంతా కరోనాపైనే చర్చసాగుతుండటంతో ఫోన్‌లలో, ఇతర సామాజిక మాధ్యమాల్లో పలువురు ప్రజలను మరింత ఆందోళనకు గురిచేసేలా మెసేజ్‌లు చేస్తున్నారు. ఫోన్లు, వాట్సాప్ గ్రూపులు ఈ మేసేజ్‌లతోనే నిండిపోతున్నాయి. అయితే వాట్సాప్‌ల్లో కరోనాపై దుష్ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సీపీ అంజని కుమార్ హెచ్చరించారు.
Also Read :తెలంగాణ కేబినెట్ భేటీ.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు..
కరోనాపై సోషల్ మీడియాలో పుకార్లు పుట్టించి, దుష్ప్రచారం చేస్తే.. జాతీయ విపత్తు నిర్వహణ మండలి చట్టం 5.1ప్రకారం వారిపై కేసులు నమోదు చేస్తామని సీపీ హెచ్చరించారు. తప్పుడు వార్తలు, వదంతులు వ్యాప్తి చేస్తే ప్రజల్లో ఆందోళన పెరుగుతుందని, సమాజానికి చెడు జరుగుతుందని అన్నారు. వదంతులు వ్యాపిస్తే ప్రజలు భయాందోళనకు గురయ్యే అవకాశాలున్నాయన్నారు. అందుకే అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏడాదిపాటు జైలు జీవితం గడపాల్సి వస్తుందని సీపీ హెచ్చరించారు. ఎవరూ కరోనా వైరస్‌పై వదంతులు సృష్టించవద్దని కోరారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం పెరగకుండా ప్రభుత్వం తీసుకోవాల్సిన అన్ని చర్యలను చేపడుతుంది.