విమానాశ్రయంలో కుక్కల కోసం స్పెషల్ స్తంభాలు

By రాణి  Published on  11 Feb 2020 5:21 AM GMT
విమానాశ్రయంలో కుక్కల కోసం స్పెషల్ స్తంభాలు

విమానాశ్రయాలు మనుషులకు వీలైనన్ని సదుపాయాలు కల్పించడంలో పోటీపడుతూంటాయి. జపాన్ లోని ఒసాకా ఎయిర్ పోర్ట్ ఈ విషయంలో పదడుగులు ముందుకు వెళ్లింది. మనుషులకేనా సదుపాయాలు, జంతువులకు వద్దా అని ఇప్పుడు కుక్కలకు “బరువు బాధలు” తీర్చుకునేందుకు, ప్రకృతి పిలుపులకు జవాబిచ్చేందుకు వీలు కల్పిస్తోంది.

విమానాశ్రయం బయట ఒక ప్రత్యేకమైన కుక్కల టాయ్ లెట్ ను ఏర్పాటు చేస్తోంది. కుక్కలకు “ఆహ్లాదకరమైన” వాతావరణం కల్పించింది. అంతే కాదు మూత్ర విసర్జనకు ప్రత్యేకమైన చోట్లు ఏర్పాటు చేసింది. అందుకోసం ఒక కాలు ఎత్తి ఆన్చేందుకు ఒక స్తంభాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఈ స్తంభం ప్రత్యేకత ఏమిటంటే కుక్క కాలు తీసేయగానే ఫ్లష్ చేసేస్తుంది. అంతే కాదు. విమానాలకోసం ఎదురుచూసే సమయంలో ఎవరైనా తమ కుక్కలకు స్నానాలు చేయించాలనుకుంటే అందుకు ప్రత్యేక షవర్లు కూడా ఏర్పాటు చేశారు. విమానం ఎక్కిన తరువాత ఇబ్బంది పడకుండా ఎయిర్ పోర్టులోనే పని కానిచ్చేసేలా సకల సన్నాహాలూ చేశారు.

ఇలాంటి కుక్కల కంఫర్ట్ జోన్, వాష్ రూమ్ ఏర్పాట్లు ఉన్న తొలి జపనీస్ విమానాశ్రయం ఇదేనట. ఇప్పటి వరకూ కుక్కలు దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన టాయిలెట్లు, వాష్ రూమ్ లను వాడుకుంటున్నాయి. అయితే మళ్లీ కడిగి పరిసరాలను పరిశుభ్రం చేసే బాధ్యత కుక్కల యజమానులదే. ఇప్పుడు ఈ కొత్త సదుపాయం వచ్చిందన్న విషయం శునక ప్రియులకు శుభవార్తే!!

Next Story