శ్వేత సౌధంలో శ్వేత శునకం

By రాణి  Published on  4 Feb 2020 10:35 AM GMT
శ్వేత సౌధంలో శ్వేత శునకం

రాజపుత్రులు యుద్ధంలో ఉండి తన పెళ్లికి తానే హాజరు కాలేకపోతే తన కత్తిని పంపించేవారట. వధువు ఆ కత్తినే పెళ్లాడేదట. ఆ తరువాత కత్తిలాంటి కుర్రాడు యుద్ధంలో కసాబిసా నరికేసి తిరిగొచ్చి శోభనం చేయించుకునేవాడట. అమెరికాలో ఇటీవల ఒక పొలిటీషియన్ కు దాదాపు ఇలాంటి పరిస్థితే ఎదురైంది.

అధ్యక్ష ఎన్నికల్లో డెమాక్రట్ల తరపున అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్న ఎలిజబెత్ వారెన్ డోనాల్డ్ ట్రంప్ అభిశంసన తీర్మానం పనుల్లో తలమునకలై ఉండిపోయింది. ఆమె అయోవా కాకస్ లో ప్రచారం చేయడం కుదరలేదు. దాంతో ఆమె పక్షాన అమె రాజపుత్రులు కత్తిని పంపించినట్టు తన కుక్క బెయిలీని పంపించిందట. కుక్కకు తోడుగా భర్త బ్రూస్ మాన్ కూడా ఉన్నాడట. గోల్డెన్ హార్వెస్టర్ జాతికి చెందిన సదరు శునకరాజం “భౌ భౌ” మంటూ ప్రచారం చేయడమే కాకుండా, ఎలిజిబెత్ లాగా సెల్ఫీ లైన్ వద్ద సెల్ఫీలు కూడా దిగిందట. “ఎలిజబెత్ కే మీ వోటు” అని విన్నప్పుడల్లా తోకాడించి, తలూపి, భౌ భౌ లతో స్వాగతం పలికిందట.

నెటిజన్లకు కూడా ఇది భలే సరదాగా అనిపించిందిట. “వైట్ హౌస్ లో వైట్ డాగ్” “ప్రథమ కుక్క”, “విశ్వాసం లేని మనిషి కన్నా విశ్వాసం ఉన్న కుక్క మేలు” “ ఈ కుక్క వైట్ హౌస్ లో ఉండాల్సిందే” వంటి కామెంట్లతో హోరెత్తించారట. “ ఈ కుక్కకే నా ఓటు” అని కూడా చాలా మంది కామెంట్లు చేశారు. డెమాక్రట్ల తరపున అధ్యక్ష పదవి అభ్యర్థిత్వం కోసం నలుగురు పోటీ పడుతున్నారు. అందులో మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్, మాజీ బేయర్ పీట్ బుట్టిగీగ్, సెనేటర్ బెర్నీ సాండర్స్, వారెన్ లు ఉన్నారు.

Next Story