తిరగబడిన మహమ్మారి.. కరోనాతో 50 మంది వైద్యులు మృతి..!

By సుభాష్  Published on  30 March 2020 12:21 PM IST
తిరగబడిన మహమ్మారి.. కరోనాతో 50 మంది వైద్యులు మృతి..!

కరోనా మహమ్మారి ప్రపంచాన్నివణికిస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్‌ దేశాలకు నిద్రలేకుండా చేస్తోంది. ఈ వైరస్‌ వల్ల ఇప్పటి వరకు 7 లక్షల పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఏ మేరకు చేరిందో అర్థం చేసుకోవచ్చు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు కరోనా వదిలి పెట్టడం లేదు. ఇప్పుడు చైనాను వదిలేసి ఇటలీ, బ్రిటన్‌, అమెరికా దేశాల్లో తిష్టవేసింది. ఇక భారత్‌లో కరోనా మృతుల సంఖ్య 21 చేరగా, పాజిటివ్‌ కేసుల సంఖ్య 1071కి చేరింది.

అమెరికాలో ఇప్పటి వరకు లక్షా 40వేలకు పైగా కేసులు నమోదు కాగా, మరణాల సంఖ్య 3వేలకు చేరువలో ఉంది. ఇక ఈ వైరస్‌ ప్రజలతో పాటు వైద్యులను సైతం బలి తీసుకుంటోంది. కరోనా బారిన ఇటలీలో పది వేలకుపైగా మృత్యువాత పడ్డారు.

ఇక కరోనా మరణాల్లో ఇటలీదే అగ్రస్థానం. ఇటలీలో ఇప్పటి వరకూ 50 మంది వైద్యులు చనిపోయినట్లు అక్కడి నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆర్డర్స్‌ ఆఫ్‌ సర్జన్స్‌ అండ్‌ డెంటిస్ట్‌ తెలిపింది. కరోనా రోగులకు చికిత్స చేసే సమయంలో వైద్యులు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం, తీవ్రమైన ఒత్తిడికి గురికావడం కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని ఆ సంస్థ ప్రసిడెంట్‌ ఫిలిప్పో అనెల్లీ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటలీలో మొత్తం 7వేల 100 మంది వైద్యులు కరోనా బారిన పడ్డట్లు తెలిపారు. అలాగే ఇటలీలో ఎక్కువ కరోనా కేసులు నమోదైన లాంబార్డీ ప్రాంతంలోనే ఏకంగా 17 మంది వైద్యులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇక అమెరికాలో గంట గంటలు పాజిటివ్‌ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.

ఇక భారత్‌లో ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య1071కు చేరింది. మృతుల సంఖ్య 27కు చేరింది. అంతర్జాతీయంగా చూసుకుంటే ప్రపంచ వ్యాప్తంగా 34వేల మంది కరోనాకు బలయ్యారు. 7.21 లక్షల కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇక ఆదివారం ఒక్కరోజే ఇటలీలో 756 మంది, స్పెయిన్‌లో 821 మంది మృతి చెందారు. ఇక చైనాలో ఇప్పటి వరకు 3,300, ఇరాన్‌లో 2,640, అమెరికాలో 2,475, ఇంగ్లండ్‌లో 1,228 మంది చనిపోయారు.

ఇక ఏపీలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 21 చేరగా, ఎలాంటి మరణాలు సంభవించలేదు. అలాగే తెలంగాణలో 70 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఒకరు మరణించారు.

Next Story