ముదురుతున‌్న గాంధీ ఆస్పత్రి వివాదం..
By అంజి
ముఖ్యాంశాలు
- మెషిన్లు పనిచేయవు, వైద్యులు విధుల్లోకి రారు: వసంత్ కుమార్
- గాంధీ ఆస్పత్రి నిర్వాకంపై ఆరోపణల వెల్లువ
హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి డాక్టర్ వసంత్ కుమార్ వ్యవహారం రోజు రోజుకు ముదురుతోంది. వసంత్ ఆరోపణలు గాంధీ ఆస్పత్రిలో కలకలం సృష్టిస్తున్నాయి. రెండేళ్లుగా ఆస్పత్రిలో బయోమెట్రిక్ సిస్టమ్ పని చేయడం లేదని.. దీంతో ఆస్పత్రి సిబ్బంది విధుల్లోకి రాకుండానే వేతనం దండుకుంటున్నారని వసంత్ ఆరోపణలు చేశాడు. అయితే వసంత్‌పై కూడా పలువురు వైద్యులు ఆరోపణలు చేస్తున్నారు. గాంధీ ఘటనపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. వసంత్ ఆరోపణలపై ఆ కమిటీ విచారణ జరుపుతోంది.
గాంధీ ఆస్పత్రి పాలనా యంత్రాంగం, హెచ్‌ఓడీలతో సూపరింటెండెంట్ డా.శ్రావణ్‌కుమార్ సమావేశమయ్యారు. డాక్టర్ వసంత్ ఆరోపణలు నిరాధరమైనవని, మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన ఆరోపణలుగా సూపరింటెండెంట్ కొట్టిపారేశారు. గాంధీ ఆస్పత్రి పారిశుద్ధ్యంలో ఎలాంటి అవినీతి జరగడం లేదని శ్రావణ్ కుమార్ తెలిపారు. మెడికల్ దుకాణాలు, క్యాంటీన్ వారి నుండి వసంత్ డబ్బులు డిమాండ్ చేశాడన్నారు. వారి దగ్గర ఉన్న ఆధారాలతోనే ఫిర్యాదు చేశారని.. ఆత్మహత్యయత్నానికి పాల్పడిన వ్యక్తి ఒక డాక్టర్‌గా పని చేస్తే అనేక దుష్పరిణామాలు జరిగే అవకాశం ఉందని సూపరింటెండెంట్ శ్రావణ్‌కుమార్ అన్నారు. టీజీడీఏజీఎస్‌గా ఎన్నికైన తర్వాత వసంత్ ఇష్టరాజ్యాంగ వ్యహరిస్తున్నాడని శ్రావణ్‌కుమార్ ఆరోపించారు. మానసిక వైద్యులు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాతే ఉద్యోగంలోకి తీసుకోవాలని ఆయన అన్నారు.
రెండు రోజుల క్రితం గాంధీ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ వసంత్‌కుమార్ ఆత్మహత్యాయత్నం తీవ్ర కలకలం రేపింది. ఆస్పత్రికి వచ్చిన వసంత్.. పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు.. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే అతడిని అడ్డుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిపై తప్పుడు సమాచారం ఇచ్చాడన్న ఆరోపణతో అతడిపై అధికారులు వేటు వేశారు. ఆస్పత్రి క్యాజువాలిటీ విభాగంలో పని చేస్తున్న వసంత్ కుమార్‌ను డైరెక్టర్ ఆఫ్ హెల్త్‌కు సరెండర్ చేస్తూ వైద్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. కొన్ని రోజుల కిందట గాంధీ ఆస్పత్రిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఓ ప్రకటన సంచలనం రేపింది. అయితే ఇది అవాస్తమని తేలడంతో.. డాక్టర్ వసంత్‌కుమారే దీనికి కారణమని గుర్తించి సరెండర్ చేశారు. కరోనా ప్రత్యేక వార్డుల ఏర్పాటుకు గాంధీ ఆస్పత్రిలో తగిన పరిస్థితులు లేవని ఢిల్లీ నుంచి వచ్చిన బృందానికి వసంత్ కుమార్ తప్పుడు సమాచారం ఇచ్చారని వైద్యాధికారులు గుర్తించారు.