వైద్యురాలి హత్య ఘటనపై తొలిసారిగా స్పందించిన 'కేసీఆర్'
By Newsmeter.Network Published on 1 Dec 2019 7:40 PM ISTవెటర్నరీ వైద్యురాలు అత్యచారం, హత్య తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా, ఆమె హత్య కేసుపై మొదటి సారిగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. జరిగిన ఘటనపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రగతి భవన్‌లో జరిగిన ఆర్టీసీ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో ప్రసంగిస్తూ మధ్యలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. వైద్యురాలి హత్య అతి దారుణమైనదని, ఈ ఘటనను తలచుకుంటే బాధేస్తుందని అన్నారు. ఇలాంటి ఘటన జరగడం అమానుషమని అన్నారు. ఈ కేసును అత్యంత వేగవంతంగా విచారించి దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కేసీఆర్ ఉన్నతాధికారులను ఆదేశించారు. కేసు సత్వర విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. కేసుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభించాలని సూచించారు. ఇటీవల వరంగల్ లో ఓ మైనర్ బాలిక హత్య విషయంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయడం వల్ల 56 రోజుల్లోనే విచారణ పూర్తయి తీర్పు వెలువడిందని కేసీఆర్ గుర్తు చేశారు. వరంగల్ తరహాలో సత్వర తీర్పు రావాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. వెటర్నరీ వైద్యురాలు కుటుంబానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మహిళలు బయటకు వెళ్తే అతి జాగ్రత్త వ్యవహరించాలని సూచించారు.