ఏపీలో సంచలనంగా మారిన డాక్టర్ అనితారాణి.. ఎందుకంటే?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  8 Jun 2020 12:14 PM IST
ఏపీలో సంచలనంగా మారిన డాక్టర్ అనితారాణి.. ఎందుకంటే?

అధికారంలో ఉన్నప్పుడు అధికారపక్ష నేత సరిగా ఉంటే సరిపోదు. ఆయన అనుచరగణంతో పాటు.. పార్టీ నేతలంతా క్రమశిక్షణతో ఉండాలి. ఇప్పటికే డాక్టర్ సుధాకర్ ఎపిసోడ్ ఏపీ సర్కారుకు ఇబ్బందిగా మారిన వేళ.. దీన్ని మరింత పెంచే మరో ఉదంతం తాజాగా తెర మీదకు వచ్చింది. అమెరికాలో పని చేసే జాబ్ వచ్చినా.. తాను పుట్టిన రాష్ట్రంలో పని చేయాలన్న ఉద్దేశంతో.. ఆ ఆఫర్ ను వదులుకున్న ఒక మహిళా వైద్యురాలికి ఏపీ అధికారపక్ష నేతలు వేధింపులకు గురి చేసిన వైనం బయటకు వచ్చింది. దళితురాలైన తనను జగన్ పార్టీ నేతలు నిర్బంధించి మరీ వేధించారని.. అసభ్య పదజాలంతో తిట్టారంటూ చేస్తున్న ఆరోపణలు సంచలనంగా మారాయి.

చిత్తూరు జిల్లాకు చెందిన డాక్టర్ అనితారాణి.. ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న గంగాధర నెల్లూరు నియోజకవర్గ పరిధిలోని పెనుమూరులో ప్రభుత్వ వైద్యురాలిగా పని చేస్తున్నారు. తనను జగన్ పార్టీ నేతలు వేధిస్తున్నట్లు ఆమె ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగా రెండునెలలక్రితమే తాను పోలీసులకు ఫిర్యాదు చేసినా.. ఇప్పటివరకూ ఎలాంటి ప్రయోజనం లేదన్నారు.

తనకు జరిగిన అన్యాయం గురించి ఆమె ఏం చెప్పిందన్నది ఆమె మాటల్లోనే చెబితే.. ‘‘గ్రామీణ ప్రజలకు సేవ చేయాలని అమెరికాలో జాబ్ వచ్చినా వదులుకొని.. ప్రభుత్వ వైద్యురాలిగా చేరాను. పెనుమూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ గా డిసెంబరునుంచి పని చేస్తున్నా. గ్రామీణ ప్రాంతాల్లో పని చేయాలన్నదే లక్ష్యం. ఆసుపత్రిలో దిగువస్థాయి సిబ్బంది అవినీతిని ప్రశ్నిస్తే.. వారు నాపై కక్ష కట్టారు. జనతా కర్ఫ్యూ అయిన మార్చిన 22న హాస్టల్ గదిలో బంధించారు. స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని పిలిపించారు. వారంతా నన్ను రకరకాలుగా హింసించారు. తిట్టారు. అభ్యంతరకరంగా ప్రవర్తించారు. బాత్రూంలోకి వెళ్లినా ఫోటోలు.. వీడియోలు తీశారు’’

‘‘నా వ్యక్తిత్వాన్నికించపరిచేలా దారుణమైన వ్యాఖ్యలు చేసి మానసికంగా హింసించారు. జరిగినదంతా వీడియోతో సహా పోలీసులకు కంప్లైంట్ చేశా. వారు కంప్లైంట్ తీసుకోకుండా ఉదయం 11 గంటల నుంచి రాత్రి పది గంటల వరకూ స్టేషన్ లోనే కూర్చోబెట్టారు. కేసు పెట్టొద్దంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో ఫోన్లు చేయించి బెదిరింపులకు పాల్పడ్డారు. ఒత్తిడి తీసుకొచ్చారు’’ అంటూ టీడీపీకి చెందిన మహిళా నేత అనితకు ఫోన్ చేసి చెప్పటం.. ఆ ఆడియో టేపు బయటకు రావటంతో ఇదో సంచలనంగా మారింది.

ఈ సమయంలో కొన్ని మీడియా సంస్థలతో మాట్లాడిన ఆమె.. తనకు జరిగిన అన్యాయాన్ని ఎవరికి చెప్పాలో అర్థం కాక.. హైకోర్టునుకూడా ఆశ్రయించినట్లు చెప్పారు. నిజానికి ఈ ఎపిసోడ్ తోనూ ముఖ్యమంత్రి జగన్ కు సంబంధం లేదు. కానీ.. తన ప్రభుత్వ ఇమేజ్ ను దెబ్బ తీసేలా వ్యవహరించే కిందిస్థాయి నేతల్ని అదుపులో పెట్టుకోవటంతో పాటు.. తప్పులు చేసిన వారు ఎవరైనా సరే.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. లేనిపక్షంలో ప్రభుత్వానికి జరిగే డ్యామేజ్ భారీగా ఉంటుందన్న మాట వినిపిస్తోంది.

Next Story