ఐఐటి-ఎమ్‌ ఫాతిమా సూసైడ్ కేసును ఎవరు దర్యాప్తు చేస్తున్నారో తెలుసా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 Nov 2019 2:04 PM IST
ఐఐటి-ఎమ్‌ ఫాతిమా సూసైడ్ కేసును ఎవరు దర్యాప్తు చేస్తున్నారో తెలుసా..?

చెన్నై: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మొదటి సంవత్సరం విద్యార్థిని ఫాతిమా లతీఫ్ ఆత్మహత్య కేసును చెన్నై సిటీ పోలీస్ విభాగం సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ కి బదిలీ చేసింది. ఐఐటి అధ్యాపకుడి వల్ల తమ కూతురు అనేక విధాలుగా ఇబ్బంది పడిందని, కుల ప్రాతిపదికన ఆమెపై ఆ అధ్యాపకుడు దౌర్జన్యం చేశాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఆరోపణల ఆధారంగా కేసును సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్‌కి బదిలీ చేశారు.

చెన్నై నగర పోలీస్ కమిషనర్ ఎ.కె.విశ్వనాథం ఐఐటి-ఎమ్ క్యాంపస్ ను సందర్శించి చనిపోవడానికి మూడు గంటల ముందు అసలు ఆ అమ్మాయి ఎలా ఉంది, తోటి విద్యార్థులతో, అధ్యాపకులతో ఎలా ప్రవర్తించింది అన్నదానిపై ఆయన స్వయంగా విచారణ జరిపారు. ఈ విచారణ అనంతరం కేసును సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ కి బదిలీ చేస్తున్నట్టుగా ఆయన మీడియా ప్రతినిధులకు తెలిపారు. మహిళలపై శిశువులపై నేరాలకు వ్యతిరేకంగా పనిచేసే విభాగానికి సంబంధించిన డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారి ఇకపై ఈ కేసును దర్యాప్తు చేస్తారు.

Iit1

మీడియాలో వైరల్ అయిన ఫాతిమా సూసైడ్ నోట్ గురించి మీడియా ప్రతినిధులు ప్రస్తావించినప్పుడు చెన్నై పోలీస్ కమిషనర్, దానిపై విచారణ జరుగుతోందని, ఈ స్థితిలో దానికి సంబంధించి మాట్లాడడం సరికాదని అన్నారు. మృతురాలి ఫోన్ లో ఉన్నట్టుగా చూపబడుతున్న ఆ సూసైడ్ నోట్ ఇప్పటికీ విస్తృత స్థాయిలో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది.

హ్యూమానిటీస్ విభాగంలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ చేస్తున్న ఫాతిమా తన హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడిందని ఐఐటి-ఎమ్ అధికారులు పోలీసులకు తెలిపారు. రాష్ట్ర పోలీస్ విభాగం విచారణను నీరు గారుస్తోందని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. తమకు సరైన న్యాయం చేయాలని కోరుతూ వాళ్లు కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ని కలిసి విజ్ఞాపన అందజేశారు. ఈ నేపథ్యంలో కేసు సెంట్రల్ క్రైమ్ విభాగానికి బదిలీ కావడం విశేషం.

Iit

మద్రాస్ ఐఐటీ ప్రధాన ద్వారం దగ్గర విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఫాతిమా మృతిపై సమగ్రమైన విచారణ జరపాలంటూ ఆందోళన జరిపారు. అధ్యాపకుడిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేసిన విద్యార్థి సంఘాలు కేసును నిష్పక్షపాతంగా విచారించేందుకు సిబిఐకి బదిలీ చేయాలని కోరారు.

సోషల్ సైన్సెస్ విభాగం విద్యార్థిని ఫాతిమా మృతిపై ఐఐటి మద్రాస్ ఒక సందేశాన్ని మీడియాకు విడుదల చేసింది. ఈ సందేశంలో ఐఐటి మద్రాస్ బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు ఫాతిమా మృతికి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.

Next Story