అలవాటైన చేతిని ఎక్కువ వాడకండి ..

By Newsmeter.Network  Published on  28 March 2020 10:24 AM GMT
అలవాటైన చేతిని ఎక్కువ వాడకండి ..

కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతుంది. ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఈ వైరస్‌ భారత్‌లోనూ, తెలుగు రాష్ట్రాల్లోనూ విజృంభిస్తోంది. ఇప్పటికే భారత్‌లో ఈ వైరస్‌ భారిన పడిన వారి సంఖ్య 900 చేరువలో ఉండగా.. 20మంది మృతి చెందారు. మరోవైపు తెలంగాణలో 59 మంది, ఏపీలో 13మంది కరోనా వైరస్‌సోకి ఐసోలేషన్‌ కేంద్రాల్లో చికిత్సపొందుతున్నారు. ఇదిలా ఉంటే కరోనాను కట్టడిచేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను ప్రకటించి ప్రజలను ఇండ్లకే పరిమితం చేశాయి. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు, ఇరు తెలుగు రాష్ట్రాల సీఎంలు ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. సామాజిక దూరం కచ్చితంగా పాటించాలని సూచిస్తున్నారు.

Also Read :కాంటాజియన్‌ సినిమా చూడండి.. వైరస్‌ వ్యాప్తి ఎలా జరుగుతుందో అర్థమవుతుంది..

ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్‌ కరోనా వైరస్‌కు దూరంగా ఉండేందుకు పలు చిట్కాలను ట్విటర్‌లో పోస్టు చేశారు. అలవాటైన చేతిని ఎక్కువగా వాడకపోవటం మంచిదని లోకేశ్‌ సూచించారు. కుడిచేతి వాటం అయితే ఎడమచేతితో.. ఎడమచేతి వాటం అయితే కుడిచేతితో తలుపు తియ్యడం లాంటి పనులు చెయ్యాలన్నారు. తద్వారా ఆ చేతితో మొహాన్ని తాకడం తగ్గుతుందని లోకేశ్‌ సూచించారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి కొన్ని దేశాలు తలలు పట్టుకుంటుంటే కొరియాలాంటి దేశాల్లో చిన్న చిట్కాలతో కరోనాకి చెక్‌ పెట్టారని లోకేశ్‌ తెలిపారు. ఈ చిన్న జాగ్రత్త కొంతవరకూ కరోనా భారిన పడకుండా ఆపుతుందని లోకేశ్‌ తన ట్విట్‌లో తెలిపారు. కేవలం ఒక్క చిట్కా మాత్రమేనని, రెండు చేతులను శుభ్రంగా కడుక్కోవడం తప్పనిసరి అని లోకేశ్‌ అన్నారు. లోకేశ్‌ ట్వీట్‌ పట్ల నెటిజర్లు అభినందిస్తున్నారు. అమూల్యమైన చిట్కాలు చెప్పారంటూ రీ ట్వీట్‌ చేస్తున్నారు.



Next Story