ప్రపంచ ఆరోగ్య సంస్థ మమ్మల్ని మోసం చేసింది.. చైనా పట్ల పక్షపాత వైఖరి చూపుతోందని, దానికి నిధులు నిలిపివేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు గురువారం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథనోమ్‌ కౌంటర్‌ ఇచ్చారు. కరోనా వైరస్‌ను రాజకీయం చేయొద్దంటూ ట్రంప్‌కు సూచించారు. డబ్ల్యూహెచ్‌వోకు కుల, మత, జాతి, వర్ణబేధాలు లేవని, ఉండబోవని అన్నారు. క్వారంటైన్‌కు పంపాల్సింది కరోనా వైరస్‌ని అని ప్రపంచ దేశాలు గుర్తించాలని ఆయన వ్యాఖ్యానించారు. మేం ప్రతీ ఒక్క దేశానికి ఆత్మీయులమేనని అన్నారు. నేతలు జాతీయ, అంతర్జాతీయ ప్రయోజనాల కోసం కృషి చేయాలని దేశాధినేతలను ఆథనోమ్‌ కోరారు.

Also Read :నెలాఖరు వరకు లాక్‌డౌన్‌ పొడగిస్తూ నిర్ణయం

అమెరికా, చైనాలతో పాటు జి-20 దేశాలే కాకుండా ప్రపంచమంతా కరోనా వ్యతిరేక పోరాటంలో ఐక్యమవ్వాల్సిన అవసరముందని, కలిసినడవకుంటే ఎంతగొప్ప దేశమైన కష్టాల్లో పడాల్సిందేనని ఆయన హెచ్చరించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ పై ట్రంప్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్‌ చైనాలో విజృంభిస్తున్న సమయంలో చైనీయులను అమెరికాలోకి అనుమతించొచ్చని తప్పుడు సలహా ఇచ్చిందని ట్రంప్‌ విమర్శించారు. తాము ఆ సమయంలో చైనీయులను నిలిపివేయాలని భావించామని కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ మాకు తప్పుడు సలహా ఇచ్చిందని, చైనాకు వత్తాసు పలికిందని ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనాకు అనుకూలంగా ఉండే డబ్ల్యూహెచ్‌వో మాకు అవసరం లేదని, దానికి మేమిచ్చే నిధులు నిలిపేస్తామంటూ ట్రంప్‌ హెచ్చరించారు. దీంతో ట్రంప్‌ వ్యాఖ్యలపై స్పందించిన డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథనోమ్‌ తీవ్రంగా ఖండించారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్