మూడు నెలలు పాటు అద్దెలు అడగొద్దు.. వేదిస్తే చర్యలు తప్పవు
By తోట వంశీ కుమార్ Published on 23 April 2020 10:14 PM ISTకరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించడానికి దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను విధించారు. ఇక తెలంగాణలోనూ ఈ లాక్‌డౌన్ కఠినంగా అమలు అవుతోంది. లాక్‌డౌన్‌తో ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. రోజువారి కూలీలు, ఉద్యోగస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మూడు నెలలు పాటు అద్దెలు వసూలు చేయవద్దని పేర్కొంటూ తెలంగాణ పురపాలక శాఖ ఉత్తర్వులు వెలువరించింది. మార్చి నుంచి 3 నెలలు పాటు యజమానులు ఇంటి అద్దె వసూలు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది.
అద్దె వసూలు చేయనందుకు ఎలాంటి వడ్డీని అడగొద్దని, మూడు నెలల తరువాత బకాయిలను వాయిదాల పద్దతిలో తీసుకోవాలని ఉత్వర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. అద్దెలు ఇవ్వాలని వేదించినా, ఇళ్ల ఖాళీ చేయాలని బెదిరించినా.. చర్యలు తప్పవని హెచ్చరించింది. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై అంటువ్యాధుల చట్టం 1897, విపత్తు నిర్వహణ చట్టం-2005 కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు కలెక్టర్లు, పురపాలక కమిషనర్లకు అధికారులు అప్పగించింది.