మృతదేహం దిశదేనని తేల్చిన డిఎన్ఎ పరీక్షాఫలితాలు

By Newsmeter.Network  Published on  13 Dec 2019 7:18 AM GMT
మృతదేహం దిశదేనని తేల్చిన డిఎన్ఎ పరీక్షాఫలితాలు

హైదరాబాద్ : చట్టన్ పల్లి బ్రిడ్జ్ దగ్గర పూర్తిగా కాలిపోయిన దశలో దొరికిన మృతదేహం దిశదేనని డి.ఎన్.ఎ పరీక్షలో నిర్ధారణ అయ్యింది. అత్యాచారం జరిగిన ఘటనా స్థలంలో, ఎన్ కౌంటర్ లో చనిపోయిన నిందితులనుంచి సేకరించిన స్పెసిమన్ స్పెర్ట్ నమూనాలు ఫోరెన్సిక్ పరీక్షల్లో సరిపోలినట్టుగా అధికారులు ధృవీకరించారు.

మహమ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు చట్టాన్ పల్లి బ్రిడ్జ్ దగ్గర ఘటనా స్థలంలోనే ఎన్ కౌంటర్ లో మరణించిన సంగతి తెలిసిందే. నిందితులనుంచి డి.ఎన్.ఎ నమూనాలను సేకరించామనీ, నేరంతో వాళ్లకు పూర్తి స్థాయి సంబంధం ఉన్నట్టు నిరూపితమవుతుందని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ చెప్పారు. తెలంగాణతోపాటుగా పొరుగురాష్ట్రాల్లోకూడా మరికొన్నిచోట్ల నిందితులు ఇదే తరహా నేరాలకు పాల్పడ్డారనడానికి ఈ సాక్ష్యాలు పనికొస్తాయని ఆయన తెలిపారు.

మృతురాలి, నిందితుల డి.ఎన్.ఎ నమూనాలను పోలీస్ అధికారులు పరీక్షకోసం ఎఫ్.ఎస్.ఎల్ కి పంపారు. మృతురాలి వెన్నెములోని చిన్న ఎముకను పరీక్షకు పంపించారు. మృతురాలి డి.ఎన్.ఎ ఆమె కుటుంబ సభ్యుల డి.ఎన్.ఎతో సరిపోలడంవల్ల మృతురాలు దిశయేనని ధృవీకరించడానికి వీలయ్యింది. ఘటనా స్థలంలో లభ్యమైన బంగారం, చెప్పులు, బట్టలు మృతురాలివేనని తేలింది.

తొండుపల్లి టోల్ ప్లాజా సమీపంనుంచి పోలీసులు మృతురాలి బట్టల్ని స్వాధీనం చేసుకున్నారు. అత్యాచారం, హత్య ఘటన జరిగిన చోట దిశ ముఖానికి కట్టుకునే స్కార్ఫ్ కూడా లభించింది. మృతురాలి శరీరంపై, బట్టలపై ఉన్న నిందితుల స్పెర్మ్ కి సంబంధించిన ఆనవాళ్లతో ఎన్ కౌంటర్ లో చనిపోయిన నలుగురు నిందితుల డి.ఎన్.ఎలను పరీక్షచేసిచూస్తే కచ్చితంగా ఆ ఆనవాళ్లు నిందితులవేనని తేలింది.

Next Story
Share it