డీఎన్ఏ ఆధారం.. వేల ఏళ్ల నాటి బాలిక చిత్రం

By అంజి  Published on  21 Dec 2019 3:05 AM GMT
డీఎన్ఏ ఆధారం.. వేల ఏళ్ల నాటి బాలిక చిత్రం

ఎవరైనా తిని పడేసిన బాబుల్ గమ్ ను చూస్తే ముందు అసహ్యించుకుంటాం. తరువాత దానికి దూరంగా జరిగిపోతాం ఎక్కడ అంటుకుంటుందో అని. అదే పోలీసులైతే నేరస్థులను పట్టుకొనే క్రమంలో డీ ఎన్ ఏ టెస్ట్ కోసం అయినా సరే జాగ్రత్త చేస్తారు. నిజానికి నేర నిర్థారణలోనే కాదు ఇతర వైద్య సంబంధ నిర్థారణ పరీక్షల్లోనూ డీఎన్ఏ కీలక పాత్ర పోషిస్తోంది. ఇంతకీ ఇదంతా ఇప్పుడు ఎందుకంటారా..? దాదాపు 5,700 ఏళ్ల క్రితం నమిలి ఉమ్మిన చూయింగమ్‌ వంటి పదార్థం మీద ఉన్న డీఎన్ఏ ఆధారంగా శాస్త్రవేత్తలు ఓ బాలిక జన్యుక్రమం మొత్తాన్ని పునః సృష్టించారు. అన్ని సంవత్సరాల క్రితం అసలు చూయింగ్ గమ్ ఉందా అని అడగకండి. ఒక చెట్టు బెరడును వారు నమిలి ఉమ్మేవారట.

 DNA

ఇంతకీ విషయం ఏమిటి అంటే. డెన్మార్క్‌ చెందిన కొందరు శాస్త్రవేత్తలు లొల్లండ్‌ అనే ప్రాంతంలో పరిశోధనల్లో భాగంగా తవ్వకాలు ప్రారంభించారు. అలా వారు తవ్వుతుండగా నీరు లేని ఓ గుంతలో జంతువుల ఎముకలు, చెక్క ముక్కల మధ్య చూయింగమ్‌ వంటి పదార్థం కనిపించింది. దానిపై డీఎన్ఏ ఆనవాళ్లు ఉండటంతో దాన్ని వారు భద్రంగా ల్యాబ్‌కు తీసుకెళ్లి పరిశోధనలు ప్రారంభించారు. ఆ డీఎన్ఏ సాయంతో వారు దాన్ని నమిలి ఉమ్మింది ఓ బాలిక అని గుర్తించారు. ఆమె 5,700 ఏళ్ల క్రితం జీవించి ఉంటుందని అంచనాకు వచ్చారు. అంతే కాకుండా వారు ఆమె జన్యువు మొత్తాన్ని పునఃసృష్టి చేశారు. ఆమె నల్లటి చర్మం, నల్లటి జుట్టు, నీలి రంగు కళ్లు ఉంటాయని అంచనాకు వచ్చి ఆమెకు లొలా అనే పేరు పెట్టారు. ఎముకలతో కాకుండా ఇతర పదార్థాల నుంచి ఓ వ్యక్తి జన్యువు మొత్తాన్ని పునః సృష్టించడం ఇదే మొదటిసారి అని నేచర్‌ కమ్యునికేషన్స్‌ అనే జర్నల్ తెలిపింది. శాస్త్రవేత్తలు అంతటితో ఆగకుండా టామ్‌ జోక్‌లాండ్‌ అనే చిత్రకారుడి సాయంతో ఆమె ఊహా చిత్రాన్ని గీయించారు. నమిలిన ఆ పదార్థంలో బాలిక నోటిలోని బ్యాక్తీరియా, చెట్టులో ఉండే సూక్ష్మ జీవుల ఆనవాలు కూడా కనపడ్డాయట.

 DNA

Next Story