వైసీపీలో రోజా ఒక ఐటమ్ సాంగ్ మాత్రమే : దివ్యవాణి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Jun 2020 11:47 AM GMT
వైసీపీలో రోజా ఒక ఐటమ్ సాంగ్ మాత్రమే : దివ్యవాణి

వైసీపీ ఎమ్మెల్యే రోజాపై టీడీపీ నాయకురాలు దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట్‌ పై రోజా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సీఎం జగన్‌, రోజాలపై ధ్వజమెత్తారు దివ్యవాణి. బీసీ నేతను అరెస్టు చేశామన్న ఆనందం తప్ప.. అరెస్టు చేయడానికి ఒక్క సరియైన కారణాన్ని చూపించారా అని ప్రశ్నించారు.

తప్పు చేశారు కాబట్టే అరెస్టు చేశామన్న రోజా వ్యాఖ్యలపై స్పందిస్తూ.. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, గతంలో జగన్‌ కూడా 16 నెలల పాటు జైల్లో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. అంటే అప్పుడు జగన్ తప్పు చేశారా అంటూ విమర్శలు గుప్పించారు. ఇప్పుడు అచ్చెన్నాయుడు తరువాత చంద్రబాబు అన్న రోజా వ్యాఖ్యలపై తీవ్రంగా ఫైర్‌ అయ్యారు దివ్యవాణి. రోజా వైసీపీలోకి అడుగు పెట్టడగానే ఎండ్ కార్డ్ పడింది. జైల్లో జగ్గూ అనే సీరియల్ 16 నెలలు సాగింది. ఇప్పటికి ప్రతి శుక్రవారం వస్తుందని ఎద్దేవా చేశారు. జైలుకి రావాలి జగన్.. కావాలి జగన్ అనే పాట ఇప్పటికీ ఉందని, ఇక ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డి అవినీతి చిట్టా సీబీఐ బయట పెట్టిందన్నారు. దీనిపై రోజా ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. వైసీపీలో రోజా ఒక ఐటమ్ సాంగ్ మాత్రమేనని, జగన్ ప్రభుత్వం ఏడాది పాలనలో సాధించింది ఏమి లేదన్నారు. నిజంగానే ఏదైనా మంచి పని చేస్తే రోజా ధైర్యంగా చెప్పాలని, ఈ విషయాలన్ని రోజా గుర్తిస్తే మంచిది అని మండిపడ్డారు.

Next Story
Share it