అచ్చెన్నాయుడి అరెస్టు పై స్పందించిన ఏసీబీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Jun 2020 7:08 AM GMT
అచ్చెన్నాయుడి అరెస్టు పై స్పందించిన ఏసీబీ

మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడి అరెస్టు పై విశాఖ ఏసీబీ అధికారులు స్పందించారు. అన్ని ఆధారాలను పరిశీలించిన తరువాతనే ఈఎస్ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడిని ఈ రోజు ఉదయం 7.30గంటలకు శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలోని ఆయన ఇంట్లో అరెస్టు చేశామని విశాఖ రేంజ్‌ ఏసీబీ జాయింట్‌ డైరెక్టర్‌ రవికుమార్‌ వెల్లడించారు. మీడియాతో మాట్లాడుతూ.. ఈఎస్‌ఐ వ్యవహారంలో అచ్చెన్నాయుడితో సహా ముగ్గురిని అరెస్టు చేసినట్లు చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించి మందులు, ల్యాబ్‌ కిట్స్‌, సర్జికల్‌ ఐటమ్స్‌, ఫర్నిచర్‌ మార్కెట్‌ ధర కన్నా ఎక్కువకు కొనుగోలు చేశారన్నారు.

దీని వల్ల ఖజానాకు నష్టం కలిగించారన్న ఆధారాలు తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు. మాజీ డైరెక్టర్‌ సీకే రమేశ్‌ కుమార్‌ బంధువుల పేర్లమీద నకిలీ కొటేషన్లతో మార్కెట్‌ ధర కంటే 50 నుంచి 130శాతం అధిక ధరలకు కోట్ చేశారన్నారు. ఈ కేసులో అప్పటి ఈఎస్ఐ డైరెక్టర్లు జీకే రమేశ్ కుమార్, విజయ్ కుమార్ లను ను అరెస్ట్ చేశామని, వీరిని విజయవాడ ఏసీబీ కోర్టులో మధ్యాహ్నం తరువాత ప్రవేశపెడతామని తెలిపారు. రూ. 988 కోట్ల కొనుగోళ్లలో రూ. 150 కోట్లకు పైగా అక్రమాలు జరిగాయని అన్నారు. ఈ కేసును మరింత లోతుగా విచారించేందుకు నిందితులను కస్టడీకి కోరనున్నట్టు తెలిపారు.

Next Story