ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా!
By Newsmeter.Network
ఏపీలో ఈనెల 25న ఉగాది పండుగరోజు జరగాల్సిన ఇళ్ల పట్టాల పంపిణీకార్యక్రమం వాయిదా పడింది. వాయిదా వేస్తూ సీఎం జగన్మోహన్‌రెడ్డి నిర్ణయించారు. శుక్రవారం తడేపల్లిలోని సీఎం క్యాంపుకార్యాలయంలో జరిగిన సమీక్షలో సీఎస్ నీలం సాహ్ని, ఉన్నతాధికారులు హాజరయ్యారు. జిల్లాల వారిగా ఇళ్ల పట్టాలు, ప్లాట్ల అభివృద్ధిపై సీఎం సమీక్షించారు. కాగా రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా వైరస్ నివారణకు చర్యలు చేపడుతున్న తరుణంలో ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా వేస్తున్నట్లు సీఎం ప్రకటించారు.
ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజున ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నట్లు సీఎం వివరించారు. లబ్ధిదారులు అందరికీ ఒకేసారి కాకుండా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్స్ చేస్తూ జాగ్రత్తలు తీసుకొని వారికి ఇళ్ల సైట్లను చూపించాలని సీఎం వై.ఎస్. జగన్ సూచించారు. ఇదిలాఉంటే తొలుత ఈనెల 25న ఉగాది పండుగ రోజు పేదలకు ఇండ్ల పట్టాలను పంపిణీ చేసేందుకు వైసీపీ సర్కార్ సిద్ధమైంది. ఈ మేరకు అన్ని జిల్లాల్లో పండుగ వాతావరణంలా ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరగాలని సీఎం జగన్మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈసీ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిలిపివేయాలని, ఎన్నికల కోడ్ తరువాత కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని సూచించింది. దీంతో ఉగాది పర్వదినం రోజు పంపిణీ కార్యక్రమం నిలిచిపోయినట్లయింది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ ప్రభావంతో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించడం, ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఆరు వారాలు వాయిదా పడ్డాయి. దీంతో మళ్లీ 25న ఉగాది రోజు పేదలకు ఇండ్ల పట్టాలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్దమైంది. కాగా శుక్రవారం జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో ఏప్రిల్ 14న పంపిణీ చేసేందుకు నిర్ణయించారు.