90 నిమిషాలకు ఒకసారి మొబైల్ ఫోన్‌ను శుభ్రం చేసుకోవాల్సిందేనా..!
By తోట వంశీ కుమార్ Published on 13 March 2020 3:10 PM GMTకరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని భయపెడుతోంది. ఎప్పుడు ఏది ముట్టుకుంటే.. ఏమవుతుందో అని భయపడుతూ ఉన్నారు ప్రజలు. భారత్ లో కూడా కోవిద్-19 కేసులు రోజు రోజుకీ పెరుగుతూ పోతున్నాయి. దీంతో డాక్టర్లు ఎన్నో సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైనా తాకినా, ఎవరినైనా తాకినా చేతులు కడుక్కోవాలని చెబుతున్నారు. ముఖ్యంగా మొబైల్ ను కూడా ప్రతి 90 నిమిషాలకొకసారి ఆల్కాహాల్ తో తయారుచేసిన శానిటైజర్ తో తుడవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఫరీదాబాద్ లోని ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హాస్పిటల్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ రవి శేఖర్ ఝా మాట్లాడుతూ మనుషులు చేతులనే కాదు స్మార్ట్ ఫోన్ స్క్రీన్ ను కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటూనే ఈ వైరస్ వ్యాప్తి నుండి బయటపడొచ్చని చెప్పారు. డాక్టర్లు ఉపయోగించే స్పిరిట్ లేదా.. ఆల్కాహాల్ తో తయారుచేసిన హ్యాండ్ శానిటైజర్ లను ఉపయోగించి ప్రతి 90 నిమిషాలకొకసారి శుభ్రం చేయాలని చెబుతున్నారు. ముఖ్యంగా కనులను, నోరు, ముక్కును ముట్టుకోవడం తగ్గించాలని ఆయన సూచించారు. ఫోన్ కవర్ ను వాడడం లేదా బ్లూటూత్ ను ఉపయోగించాలని ఆయన సూచించారు. రోజుకు రెండు సార్లైనా ఫోన్ ను నీటుగా తుడవాలని ఆయన చెప్పారు.
ఇన్సూరెన్స్2గో అనే ఇన్సూరెన్స్ ప్రొవైడర్ 2018లో చేసిన రీసర్చ్ ఆధారంగా మొబైల్ ఫోన్ స్క్రీన్ మీద ఉండే క్రిములు టాయిలెట్ సీట్ మీద ఉండే క్రిముల కంటే మూడు రెట్లు ఎక్కువట. 20 మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులలో కేవలం ఒక్కరు మాత్రమే ఆరునెలల్లో ఒక్కసారి తమ స్మార్ట్ ఫోన్ ను శుభ్రం చేస్తున్నారట. కరోనా వైరస్ ప్రబలుతున్న తరుణంలో కనీసం ఇప్పుడైనా మొబైల్ ఫోన్ లను పరిశుభ్రంగా ఉంచుకుంటే బాగుంటుంది. ఆల్కాహాల్ తో తయారు చేసిన శానిటైజర్లను ఉపయోగించి మొబైల్ ఫోన్ స్క్రీన్ ను శుభ్రం చేసుకోవాలన్నారు. కొన్ని చుక్కల శానిటైజర్ ను స్క్రీన్ మీద వేసి ఏదైనా వస్త్రంతో కానీ, కాటన్ తో కానీ శుభ్రం చేయాలని ఢిల్లీ లోని శ్రీ బాలాజీ యాక్షన్ మెడికల్ ఇన్స్టిట్యూట్ లోని మైక్రోబయాలజీ విభాగం సీనియర్ కన్సల్టెంట్ జ్యోతి ముట్ట తెలిపారు. ఉదయం, సాయంత్రం ఇలా చేస్తే మొబైల్ ఫోన్ స్క్రీన్ క్రిములకు ఆశ్రయం ఇచ్చే అవకాశమే లేదని అన్నారు. ఎవరైతే ఫ్లూ లాంటి రోగాలతో బాధపడుతూ ఉంటారో వారి మొబైల్ ఫోన్స్ అసలు వాడకూడదని ఆమె సూచించారు.
యూకేకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ సర్రే చేసిన రీసెర్చ్ లో మొబైల్ ఫోన్ లోని హోమ్ బటన్ కొన్ని మిలియన్ల బ్యాక్టీరియాకు ఆశ్రమంగా నిలిచిందట.. వీటిలో మనిషికి హాని కలిగించేవి కూడా ఉంటాయని తెలిపారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ బుధవారం నాడు కరోనా వైరస్ ను మహమ్మారిగా ప్రకటించింది. కోవిద్-19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా 4500 మంది మరణించగా, లక్ష మందికి పైగా ఈ మహమ్మారి బారిన పడ్డారని రిపోర్టులు తెలిపాయి.
ఢిల్లీ లోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రి లోని ఇంటర్నల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ సీనియర్ కన్సల్టెంట్ సురంజీత్ ఛటర్జీ మాట్లాడుతూ 'మనం చేతులు కడుక్కుంటూ ఉంటాం, దగ్గు వచ్చినప్పుడు చేతులు అడ్డం పెట్టుకుంటూ ఉంటాం.. అలాగే మరిన్ని విషయాలలో కూడా మార్పులు వస్తే చాలా బాగుంటుంది. కరోనా వైరస్ అలాగే మిగిలిన వైరస్ లు గ్లాస్, లోహాలు, ప్లాస్టిక్ లాంటి వాటిపై ఉంటాయి. మనం చేతులు కడుక్కున్నట్లుగా సెల్ ఫోన్ గ్లాస్ ను కూడా శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం. మొబైల్ ఫోన్ తయారీదారులు ఇచ్చిన గైడ్ లైన్స్ ను పాటిస్తూ శానిటైజర్లను ఉపయోగించి మొబైల్ ఫోన్ ను శుభ్రం చేసుకోవడం చాలా మంచిది' అని తెలిపారు.