రాంగోపాల్ వర్మకు షాక్.. 'దిశ' సినిమాను ఆపండి
By సుభాష్ Published on 10 Oct 2020 4:06 AM GMTరాంగోపాల్ వర్మ.. ఈ పేరు ఎప్పుడు వివాదాల్లోనే ఉంటుంది. వివాదాల దర్శకుడు ఎవరంటే టక్కున వచ్చే పేరు రాంగోపాల్ వర్మ. ఏదో ఒక వివాదంతో ముందుంటారు. అయితే 'దిశా' పేరుతో ఓ సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. యథార్థ సంఘటనల నేపథ్యంలో ఈ సినిమా నిర్మిస్తున్నాడు వర్మ. ఆయన ఇప్పటికే పలు రాజకీయ, క్రైమ్ లాంటి అంశాలను వెండితెరపై చూపించాడు.2019 నవంబర్‌లో హైదరాబాద్‌లో జరిగిన దిశా అత్యాచార, హత్య సంఘటన నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు వర్మ. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్‌లుక్ విడుదల కూడా అయింది. ఆ తర్వాత ట్రైలర్ కూడా విడుదల చేశాడు. శంషాబాద్ సమీపంలోని చటాన్ పల్లి దగ్గర నలుగురు మానవ మృగాళ్లు ఒక యువతిపై అత్యంత దారుణంగా దాడి చేసి హత్య చేయడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన తర్వాత నిందితుల ఎన్‌కౌటర్ జరిగిన తీరు ఆధారంగా రామ్‌గోపాల్ వర్మ 'దిశ ఎన్‌కౌంటర్' అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
అయితే తాజాగా ఈ సినిమా విడుదలను అడ్డుకోవాలని కోరుతూ దిశ తండ్రి హైకోర్టును ఆశ్రయించాడు. ఈ మేరకు దిశా తండ్రి దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ నవీన్‌రావు శుక్రవారం విచారించారు.
దిశ ఘటన, ఆ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్ చేసిన ఘటనలపై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక కమిటీ విచారణ జరుపుతుందని, ఈ సినిమా నిర్మాణం చేపట్టడం సరికాదని దిశ తండ్రి తరపున న్యాయవాది కోర్టుకు వివరించారు. ఈ నేపథ్యంలో సినిమాను కేంద్ర ప్రభుత్వంతోపాటు సెన్సార్‌బోర్డు ఎందుకు అడ్డుకోవడం లేదంటూ తెలపాలని దిశ తండ్రి పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై స్పందించిన తెలంగాణ అదనపు సోలిసిటర్ జనరల్ తన వాదనలు వినిపిస్తూ, పిటిషనర్ ఈ సినిమాను అడ్డుకోవాలని రాత పూర్వకంగా కేంద్ర ప్రభుత్వానికి గానీ, సెన్సార్ బోర్డుకు ఎలాంటి అభ్యర్థన లేఖలు రాయలేదని పేర్కొన్నారు. దీంతో వాదనలు విన్నన తర్వాత ఈ అంశంపై వెంటనే కేంద్రం, సెన్సార్ బోర్డు దిశ తండ్రి అభ్యర్థనను పరిష్కరించాలని తీర్పునిచ్చారు.