వర్మ ఆఫీస్‌ ఎదుట దిశ తండ్రి ధర్నా

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 Oct 2020 7:17 AM GMT
వర్మ ఆఫీస్‌ ఎదుట దిశ తండ్రి ధర్నా

నిత్యం వివాదాలతో సావాసం చేసే దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం, నిందితుల ఎన్‌కౌంటర్‌ ఆధారంగా 'దిశ ఎన్‌కౌంటర్‌' పేరిట ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. కాగా.. ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని దిశ తండ్రి శ్రీధర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

ఆదివారం ఆయన రామ్‌గోపాల్‌ వర్మ కార్యాలయం ఎదుట ఆయన ధర్నాకు దిగారు. సోషల్ మీడియాలో వస్తోన్న కామెంట్లు తమను కలిచి వేస్తున్నాయని ఆయన అన్నారు. ఆయన వెంట పలువురు మహిళలు, స్నేహితులు ఉన్నారు. వారంతా దిశ సినిమాను ఆపాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న దిశ కుటుంబాన్ని వర్మ తన సినిమాతో మరింత ఆవేదనకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఎమోషన్లని డబ్బు చేసుకోవాలనుకుంటున్న వర్మ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిర్భయ అత్యాచారం తర్వాత జరిగిన అనేక కేసుల ఆధారంగా తాను కల్పిత కథతో ఈ సినిమా తీస్తున్నానని వర్మ అన్నారు. నవంబరు 26న విడుదల చేయనున్నట్లు వెల్లడించగా.. ఈ సినిమా విడుదల విషయంలో కోర్టు చెప్పినట్లు నడుచుకుంటామని ఇప్పటికే నిర్మాత నట్టికుమార్ తెలిపిన విషయం తెలిసిందే.

Next Story