దిశ ఘటన.. శివారు ప్రాంతాల్లో డ్రోన్లతో నిఘా..!
By Newsmeter.Network Published on 23 Dec 2019 7:24 AM GMTముఖ్యాంశాలు
- సులభంగా నిఘా నిర్వహించే అవకాశం
- సామాన్యులకు డ్రోన్లను వాడే అధికారం లేదు
- ఖచ్చితంగా అనుమతి తీసుకోవాల్సిందే
- తీవ్రవాద ముప్పు వల్ల డ్రోన్లను ఎగరేయడం బ్యాన్
హైదరాబాద్: జస్టిస్ ఫర్ దిశ ఘటన మొత్తం తెలంగాణ రాష్ట్రాన్నే కుదిపేసింది. మహిళల భద్రత పట్ల ప్రభుత్వం, పోలీస్ శాఖ ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ ఘటన మరోసారి తెలియజెప్పింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పోలీసింగ్ పెట్రోలింగ్‌ను పెంచాలని రాష్ట్ర హోంశాఖ నిర్ణయించింది.
అయితే ఉన్న కొద్దిమంది పోలీసులతో అన్నివేళలా అన్నిచోట్లా పెట్రోలింగ్ చేయడం సాధ్యంకాదు. దీనికి సరైన పరిష్కారం కోసం వెతికినప్పుడు చక్కటి ఆలోచన పోలీస్ బాసులకు స్ఫూరించింది. దాన్ని అమల్లో పెడితే నిఘా మరింత సులభమవుతుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇంతకీ ఆ సరికొత్త ఆలోచన ఏంటంటే డ్రోన్ స్కాన్.
శివారు ప్రాంతాల్లో అసాంఘిక శక్తుల కదలికలను కనిపెట్టడానికి డ్రోన్ల సాయంతో నిఘాను ఏర్పాటు చేయడం వల్ల చాలా ఉపయోగం ఉంటుందని పోలీస్ శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఎంపిక చేసిన కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా నేరాల రేటును గణనీయంగా తగ్గించడానికి అవకాశం ఉంటుందని అనుకుంటున్నారు.
సంబంధిత అధికారుల నుంచి అనుమతి వచ్చిన తర్వాతనే పోలీస్ శాఖ ఈ నిర్ణయాన్ని అమలు చేయాల్సి ఉంటుంది. ఏడాది క్రితం ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ ఐటీ కారిడార్ లో మహిళా ఉద్యోగుల భద్రత కోసం డ్రోన్ల సాయంతో నిఘాను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోందని, త్వరలోనే ఈ అలోచన కార్యరూపం దాలుస్తుందని అన్నారు.
ఇప్పుడు ఈ డ్రోన్ స్కాన్ ని జిల్లాలకు కూడా విస్తరిస్తే ఇసుక మాఫీ, స్మగ్లింగ్, సరకుల అక్రమ రవాణా, గాంబ్లింగ్ లాంటి ఎన్నో అక్రమాలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంటుంది. ఈ విధానంలో ఘటనా స్థలానికి మనుషులు వెళ్లాల్సిన అవసరం లేదు కనుక చాలా సులభంగా తక్కువ సమయంలో దృశ్యాలను, సమాచారాన్ని చూసే వీలుటుంది.
మహారాష్ట్ర, తెలంగాణ ఎన్నికల సమయంలో పోలీసులు జిల్లాల సరిహద్దులు, రాష్ట్రాల సరిహద్దుల్లోకూడా ఈ డ్రోన్లతో నిఘా పెట్టారు. ఎన్నికలను బహిష్కరించాలంటూ మావోయిస్టులు పిలుపు ఇచ్చిన కారణంగా వారి కదలికలపై నిఘా ఉంచేందుకు అప్పట్లో ఈ నిర్ణయం తీసుకున్నారు.
అనుమతి తప్పనిసరి..
డ్రోన్లు, పారా గ్లైడర్లు, రిమోట్ కంట్రోల్డ్ మైక్రో లైట్ ఎయిర్ క్రాఫ్ట్ లను ఎగరేయడానికి సాధారణ పౌరులకు ఎలాంటి అనుమతీ లేదు. తీవ్రవాదులు, ఉగ్రవాదులు కూడా ఆ టెక్నాలజీని ఉపయోగించుకోవడానికి వీలుంది కనుక, భద్రత రీత్యా మొత్తంగా డ్రోన్లను ఎగరేయాలంటే ముందుగా అధికారుల నుంచి అనుమతి తీసుకోవడం తప్పనిసరి.
ఇలా ఎగిరే వస్తువులు, టెక్నలాజికల్ ఇన్ స్ట్రుమెంట్స్ ని వాడడాన్ని నిషేధించిన విషయాన్ని పోలీసులు ప్రకటనల ద్వారా గుర్తుచేస్తూనే ఉన్నారు. అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన డ్రోన్లు అయితే అవి ఆటవస్తువులైనా సరే వాడడానికి వీల్లేదని నిషేధాజ్ఞలు స్పష్టంగా ఉన్నాయి.
సర్వసాధారణంగా చిన్న చిన్న ఫంక్షన్లలో వీడియోగ్రఫీకోసం ఉపయోగించే అతి చిన్న డ్రోన్లు, ఈ మధ్యకాలంలో ప్రయోగాత్మకంగా పంటపొలాల్లో పురుగుమందులను పిచికారీ చేయడానికి ఉపయోగించే డ్రోన్ల వాడకానికి కూడా తప్పనిసరిగా ముందస్తు పోలీసు అనుమతి తీసుకోవాల్సిందే.