దిశ కాలేయంలో 'ఆల్కహాల్'.. రేపిస్టులు బలవంతంగా తాగించారు!!

By Newsmeter.Network  Published on  14 Dec 2019 6:15 AM GMT
దిశ కాలేయంలో ఆల్కహాల్..  రేపిస్టులు  బలవంతంగా తాగించారు!!

తెలంగాణ ఫారెన్సిక్ టాక్సికాలజీ విభాగం దిశ కేసులో ఇచ్చిన రిపోర్టులో ఆమె శరీరంలో ఆల్కహాల్ ఉన్నట్టు తేల్చింది. నలుగురు దుండగుల చేతిలో అత్యాచారానికి, హత్యకు గురైన వెటర్నరీ డాక్టర్ దిశ కేసులో నిందితులు నలుగురు ఆమె చేత బలవంతంగా మద్యం తాగించి రేప్ చేశారని పోలీసులు తొలి నుంచీ చెబుతూ వస్తున్నారు. తాజా నివేదిక పోలీసుల కథనాన్ని ధ్రువీకరించినట్టయింది. దిశ కాలేయ కణాల్లో ఆల్కహాల్ ఉందని నివేదిక తెలిపింది.

నవంబర్ 27 న దిశ తన వాహనాన్ని తొందుపల్లి టోల్ గేట్ వద్ద పార్క్ చేసి, క్యాబ్ లో గచ్చిబౌలి లోని ఆలివ్ ఆస్పత్రి లోని డెర్మటాలజిస్టు వద్దకువెళ్లింది. అక్కడ అరగంట ఉండి రాత్రి 9.30 కి టోల్ గేట్ వద్దకు తిరిగి వచ్చింది. ఈ మధ్య ఆమెకు ఆల్కహాల్ సేవించే అవకాశం లేదు. కాబట్టి నిందితులే ఆమె చేత మద్యం తాగించారని పోలీసులు భావిస్తున్నారు. దిశ లోదుస్తులపై నలుగురు నిందితుల – మహ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్న కేశవులు – వీర్యం ఉందని కూడా నివేదిక తెలిపింది. కాబట్టి వీరే రేప్ చేసినట్టు ఋజువైంది. అదే విధంగా కాలిపోయిన మహిళ దిశేనని డీఎన్ ఏ పరీక్షల ద్వారా నిరూపితమైంది. ఆమె మృతదేహంలోని డీ ఎన్ ఏ, దిశ కుటుంబ సభ్యుల డీ ఎన్ ఏ తో సరిపోలిందని నివేదిక తెలియచేసింది.

నలుగురు నిందితులూ చనిపోయినప్పటికీ ఈ కేసుల చార్జిషీటు దాఖలు చేయడం జరుగుతుందని పోలీసులు చెబుతున్నారు. నవంబర్ 27 న వెటర్నరీ డాక్టర్ దిశ ఇంటికి తిరిగి వస్తూండగా రాత్రి నలుగురు దుండగులు ఆమెపై సామూహిక అత్యచారం చేసి, చంపేశారు. ఈ ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తరువాత నిందితులు పారిపోయే ప్రయత్నం చేస్తున్న సమయంలో వారందరినీ పోలీసులు కాల్చి చంపారు.

Next Story
Share it