దిశ ఘటన, నిందితుల ఎన్‌కౌంటర్‌ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దిశ హత్యాచార కేసులో ఏ4గా నిందితుడు చెన్నకేశవులు ఉన్నాడు. చెన్నకేశవుల భార్య గురించి కొన్ని ఆసక్తిరమైన విషయాలు బయటకు వచ్చాయి. ఎన్‌కౌంటర్‌ అయిన నిందితుల కుటుంబీకులపై కూడా అధికారులు ఆరా తీశారు. నిందితుడు చెన్న కేశవుల భార్య మైనర్ అని స్పష్టమైంది. ఆమె వయసు 13 ఏళ్లని అధికారులు జరిపిన విచారణలో తేలింది. నారాయణపేట జిల్లా బాలల సంరక్షణ విభాగం శుక్రవారం గ్రామంలో ప్రాథమిక విచారణ చేపట్టారు. ఆమె చదువుకున్న పాఠశాలలో ఆ బాలికకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించారు. ఆమె వయసు 13సంవత్సరాల ఆరు నెలలుగా అధికారులు గుర్తించారు. ఆమె పుట్టింది జూన్‌ 15, 2006గా ఉంది. ఆమె ప్రస్తుతం 6 నెలల గర్భవతి కూడా. దీంతో చెన్నకేశవులు తల్లిదండ్రులతో అధికారులు మాట్లాడారు. బాలికకు 18 ఏళ్లు వచ్చే వరకు బాలల సదనంలో రక్షణ కల్పిస్తామని అధికారుల తెలుపగా, అందుకు వారు నిరాకరించారు.

తల్లిదండ్రులు లేకపోవడంతో చిన్నప్పటి నుంచి బాబాయి, నాయనమ్మ వద్ద ఆమె ఉండేది. చెన్నకేశవను ప్రేమ వివాహం చేసుకున్న తరువాత అత్తగారింటికి వచ్చింది. ఆమెకు 18 ఏళ్లు వచ్చే వరకు బాలల సదనంలో రక్షణ కల్పిస్తామని అధికారులు నిందితుని తల్లిదండ్రులకు సూచించారు. వారు అందుకు అంగీకరించలేదు. ఆ బాలికకు మరో చెల్లెలు, తమ్ముడు ఉన్నారు. ప్రస్తుతం వాళ్లిద్దరు తమ బాబాయి ఇంట్లో ఉంటున్నారు. వారినైనా సంరక్షణ కేంద్రానికి పంపిస్తారా అని అధికారులు అడిగారు. బాలిక చెల్లెలు తమ వద్దే ఉంటుందని, తమ్ముడిని సంరక్షణ కేంద్రానికి పంపిస్తానని వారి బాబాయి తెలిపారు. దిశ కేసులో నిందితులందరి కుటుంబీకులపై అధికారులు విచారణ చేపడుతున్నారు. వారి ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.