అసెంబ్లీలో ఉల్లి లొల్లి..!
By రాణి Published on 10 Dec 2019 1:37 PM ISTరెండోరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఉల్లి ధరల నియంత్రణపై టీడీపీ నేతలు చర్చకు తెరలేపారు. దళారులు ఉల్లి కృత్రిమ కొరతను సృష్టించి ధరలు అమాంతం పెరిగేలా చేశారని, ఇప్పుడు సామాన్యులు ఉల్లిని కొనకుండానే కన్నీళ్లు పెట్టే పరిస్థితి ఏర్పడిందని టీడీపీ నేతలు యద్దేవా చేశారు. ఉల్లి ధరలు ఇంత దారుణంగా పెరుగుతున్నా ప్రభుత్వం కనీస జాగ్రత్త చర్యలు తీసుకోలేదని టీడీపీ నేతలు ఆరోపించారు. గుడివాడ రైతు మార్కెట్ కు ఉల్లిపాయల కోసం వెళ్లిన వ్యక్తి గుండెపోటుతో చనిపోవడం నిజం కాదా అని చంద్రబాబు ప్రశ్నించారు. పేదవారి జీవితాలతో వైసీపీ ప్రభుత్వం ఆడుకుంటుందని, వినియోగదారుడు ఉల్లికోసం వెళ్లి చనిపోలేదని చెప్పడం దారుణమని విమర్శించారు. ప్రతిపక్ష నేతల ఆరోపణలపై స్పందించిన మంత్రి పార్థసారథి ఉల్లి ధరలు పెరగడానికి గల కారణాలను వివరించారు. అకాల వర్షాలు, దిగుబడి తగ్గడంతోనే ఉల్లి ధరలు పెరిగాయన్నారు. ఉల్లి ధరలు పెరుగుతాయని ముందే గుర్తించిన ప్రభుత్వం తగు జాగ్రత్త చర్యలు చేపట్టిందన్నారు. రాష్ర్టంలో ఉన్న 101 రైతుబజార్లలో సబ్సిడి కింద రూ.25కే కిలో ఉల్లిపాయల్ని ప్రజలకు అందజేస్తున్నామన్నారు.
అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ గుడివాడ రైతు మార్కెట్ లో గుండెపోటుతో చనిపోయిన సాంబరెడ్డి అనే వ్యక్తికి పెరాలసిస్ ఉందని, అతను కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలిపారు. చంద్రబాబు శవ రాజకీయాలకు తెరలేపేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. రాష్ర్టమంతా బాబు తన జాగీరు అనుకోవద్దని, గుడివాడలో కొడాలి నాని ఉన్నాడన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. మంత్రి కన్నబాబు మాట్లాడుతూ గుడివాడలో వ్యక్తి చనిపోవడానికి ఉల్లి ధరలకు సంబంధం లేదన్నారు. ఇంత ఉల్లి కొరతలోనూ సబ్సిడి పై రూ.25కి ఉల్లిని అందించిన ఘనత సీఎం జగన్ దే అని కొనియాడారు. టీడీపీ నేత చంద్రబాబు ఎప్పుడూ ఒకరితో చెప్పించుకోకూడదని మాకు చెప్తుంటారు కానీ ఇప్పుడు ఆయన అసత్య ఆరోపణలు చేస్తూ మాతో చెప్పించుకుంటున్నారని విమర్శించారు. సోమవారం జరిగిన సభలో టీడీపీ నేతలు చేసిన హంగామాకు క్షమాపణ చెప్పాలని కన్నబాబు డిమాండ్ చేశారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ర్టంలోని అన్ని రైతు బజార్లలో రూ.25కి సబ్సిడి రూపంలో ఉల్లిని అందిస్తున్నాం కాబట్టి జనం క్యూ కడుతున్నారన్నారు. వచ్చే శుక్రవారం నుంచి అన్ని మార్కెట్ యార్డుల్లో కూడా సబ్సిడి ఉల్లిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జగన్ చెప్పుకొచ్చారు. దేశంలో ఏ రాష్ర్టంలోనూ లేని విధంగా ఏపీలో అతి తక్కువ ధరకు, సామాన్యులకు అందుబాటులో ఉండేలా ఉల్లిని సరఫరా చేస్తున్నామన్నారు. ఉల్లి ధరలపై ఇంత పోరాటం చేసే చంద్రబాబు హెరిటేజ్ ఫ్రెష్ లో కిలో ఉల్లిని రూ.200కు విక్రయించడం ఏమిటని జగన్ ప్రశ్నించారు. జగన్ ప్రశ్నకు చంద్రబాబు సమాధానమిచ్చారు. హెరిటేజ్ ఫ్రెష్ మాది కాదని చెప్పినా మళ్లీ అదే మాట్లాడటం సబబు కాదన్నారు. హెరిటేజ్ ఫ్రెష్ మాదేనని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని చంద్రబాబు జగన్ కు సవాల్ విసిరారు.